Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళేశ్వరం జాతీయహోదా మరిచిపోవాల్సిందే !
- సాగునీటి రంగానికి మొండిచేయి
- కేంద్ర బడ్జెట్‌పై నిపుణుల పెదవివిరుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అనుకున్నంతా అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తలిస్తే, కేంద్రం మరోకటి చేసింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర సాగునీటి రంగానికి మొండిచేయి చూపింది. రిక్తహస్తాలనే మిగిల్చింది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు దాదాపు మూడేండ్లుగా సీఎం కేసీఆర్ సర్కారు అడుగుతున్న జాతీయ హోదా సంగతిని పక్కనబెట్టింది. అంతేగాక వేగవంతమైన సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) నిధులకూ కోతపెట్టింది. యూపీఏ కాలం నుంచి కొనసాగుతున్న ఈ నిధులను 50 శాతం వరకు తగ్గించింది. దీనిపై సర్కారుతోపాటు సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఏఐబీపీ ద్వారా భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే కార్యక్రమాన్ని దాదాపుగా నీరుగార్చింది. 1996-97లో యూఏపీ సర్కారు ఏఐబీపీ పథకానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులకు ఏఐబీపీ నిధులు వచ్చాయి. ఇందులో నాలుగు భారీ ప్రాజెక్టులు కాగా, ఏడు చిన్న తరహావి. దాదాపు రూ.4,516.19 కోట్లు వచ్చాయి. 2005-06లో మాత్రం రూ.11,485.46 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఆ తర్వాత రూ.21,683.14 కోట్లుగా సవరించింది. కాగా తాజా బడ్జెట్లో ఏఐబీపీ నిధులను రాష్ట్రానికి తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. బడ్జెట్లో కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ప్రస్తావనే తేలేదు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును గాలికొదిలేసింది. వీటికి ఏఐబీపీ నిధులను అడిగినా ఇప్పటివరకు కేంద్రం స్పందించకపోవడం గమనార్హం. ఇదిలావుండగా దేశంలో ఆదర్శ తాగనీటి పథకంగా కేంద్రం పదే పదే ప్రశంసిస్తున్న మిషన్ భగీరథ పథకానికీ నిధులు ఇవ్వలేదు. నిధులు కేటాయించాలంటూ 2018లోనే నిటిఅయోగ్ చేసిన సిఫారసులను కేంద్రం బుట్టదాఖలు చేసింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ ప్రయోజనాలు చూడటం మినహా రాష్ట్రాల సంక్షేమానికి పట్టించుకోకపోవడం తెలిసిందే.
సరికాదు: సారంపల్లి
కేంద్ర బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమంతోపాటు సాగునీటి రంగానికి కేటాయింపులు సరిగ్గాలేవని సాగునీటిరంగ నిపుణులు , అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అడుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. అలాగే ఏఐబీపీ నిధులనూ తగ్గించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మిలా సీతారామన్ బడ్జెట్ కార్పోరేట్లకే తప్ప, ప్రజలకు కాదన్నారు.