Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర విజ్ఞప్తులు బుట్టదాఖలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో రైలు కూత వినిపించకుండా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అవి కావాలి..ఇవి కావాలి అంటూ అనేక ప్రతిపాదనల్ని రాష్ట్రంలోని అధికారపార్టీ ఎంపీలు కేంద్రప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తులన్నీ బుట్టదాఖలయ్యాయి. కనీసం ఒక్క కొత్త రైలు ప్రతిపాదన కూడా కేంద్ర బడ్జెట్లో చేయలేదు. గతంలో కనీసం రైళ్ల రూటును పొడిగిస్తూనన్నా నిర్ణయాలు తీసుకొనేవారు. ఈ సారి దానికీ 'సారీ' చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావనే బడ్జెట్లో లేదు. మౌలాలి, చర్లపల్లి రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు నిధులు కేటాయించలేదు. కొత్త రైల్లే లైన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు ఏవీ పట్టాలు ఎక్కలేదు. మనోహరాబాద్ - కొత్తపల్లితోపాటు అక్కన్నపేట్ - మెదక్ రైల్వే లైను, భద్రాచలం రోడ్ - సత్తుపల్లి లైన్ల నిర్మాణానికి నిధుల కేటాయింపులో స్పష్టత ఇవ్వలేదు. కాజీపేట - విజయవాడ మధ్య విద్యుదీకరణతో కూడిన మూడో లైను నిర్మాణానికి నిధుల కేటాయింపు లేదు. రాఘవాపురం - మందమర్రి మధ్య మూడో లైను నిర్మాణానిదీ అదే పరిస్థితి. ఆర్మూర్ - నిర్మల్ - ఆదిలాబాద్ మధ్య బ్రాడ్ గేజ్ లైను పనులకు స్వల్పంగా నిధులు కేటాయించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇంకా వివరాలు రావల్సి ఉందన్నారు. సికింద్రాబాద్ - జహీరాబాద్ రైల్వే లైన్లను డబుల్ లేన్లుగా మార్చాలనే డిమాండ్‌ను పట్టించుకోలేదు. హుజూరాబాద్ మీదుగా కాజీపేట - కరీంనగర్ మధ్య రైల్వే లైను ఏర్పాటు సంగతి తర్వాత ముందు సర్వే చేయమని రాష్ట్రం కోరితే, దానికి స్వల్పంగా నిధులు కేటాయించినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రస్తావించారు.