Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశద్రోహ, ప్రజావ్యతిరేక బడ్జెట్
- ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
- రక్షణరంగం, ఎల్ఐసీ ప్రయివేటీకరణ ప్రమాదకరం : సాయిబాబు
- దొడ్డిదారిన వ్యవసాయ ప్రయివేటీకరణకు యత్నాలు : టి.సాగర్
- గోల్కొండ చౌరస్తాలో కేంద్ర బడ్జెట్ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బడ్జెట్ దేశాభివృద్ధికి దోహదపడేలా ఉండాలిగానీ..దేశ ఆస్తులను అమ్మేసేలా ఉండొద్దని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. వచ్చే 25 ఏండ్లకు దిశానిర్దేశం చేసే బడ్జెట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలను ఆమ్మేయడమేనా? అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గోల్కొండ చౌరస్తాలో సీఐటీయూ-రైతు సంఘం-వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ దిష్టిబొమ్మను దహనం చేశారు. 'రక్షణ రంగ ప్రయివేటీకరణ నశించాలి..రైతు వ్యతిరేక బడ్జెట్‌ను వ్యతిరేకించండి..కనీస ఆదాయం పెంచని బడ్జెట్ ఎందుకు? ఎందుకు?.. ఆపాలి..ఆపాలి..ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసీ ప్రయివేటీకరణను ఆపాలి..' అంటూ పెద్దపెట్టున నినదించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బి.వెంకట్ మాట్లాడుతూ.. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభుత్వ రంగాన్ని అంబానీ, ఆదానీలకు అమ్మేసేలా ఉందని విమర్శించారు. దేశంలో 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉందనీ, వాటిని సాగు చేసే వాటిలో చిన్న,సన్నకారు రైతులే 60 శాతం మంది ఉన్నారని తెలిపారు. వారి కోసం చేసిందేమీ లేదన్నారు. వ్యవసాయకార్మికులు, కౌలుదారులు, చేతివృత్తిదారులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఉపాధి హామీ చట్టానికి రెండు లక్షల కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తుంటే రూ. 73 వేల కోట్లకు కుదించటం దారుణమని విమర్శిం చారు. ప్రజలకు ఉపయోగపడని బడ్జెట్ ఎందుకని ప్రశ్నిం చారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లాడుతూ..దేశంలో సంపదంతా కొంత మంది దగ్గరే పోగుపడుతుందన్నారు. అలా కాకుండా ప్రజల్లో కొనుగోలు స్థాయిని పెంచి ఆ సంపద అందరికీ పంపిణీ అయ్యేలా చూడాల్సిన బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుందన్నారు. 50 కోట్ల కార్మికులకు కనీసవేతనాలివ్వాలనీ, రైతులకు కనీస మద్దతు ధరలివ్వాలనీ, అసంఘటిత కార్మికులకు, కూలీలకు, చేతివృత్తిదారులకు రూ.7500 ఇవ్వాలనే డిమాండ్లను విస్మరించిందన్నారు. అన్ని రంగాల్లోకి డిజిటల్ వ్యవస్థను జొప్పిస్తూ కార్పొరేట్లకు లాభాలు గడించిపెట్టే పనిలో బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇన్సూరెన్స్, రక్షణ, తదితర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి ప్రజలపై పెట్రోల్, డీజిల్, పన్నుల భారాలను మోపి రూ.18 లక్షల కోట్లను రాబట్టుకునే పనిలో సర్కారు ఉందన్నారు. ఇది ముమ్మాటికీ దేశద్రోహ, ప్రజావ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. టి.సాగర్ మాట్లాడుతూ..నిరుపేదలకు నిరాశ మిగిల్చిన బడ్జెట్ ఇది అన్నారు. అంబానీ, ఆదానీ, తదితర కార్పొరేట్లకు 12 శాతం ఉన్న పన్నును ఏడు శాతానికి కుదించడం దారుణమని విమర్శించారు. ఒకేసారి ఐదు శాతం కార్పొరేట్లకు పన్ను మినహాయింపు ఇచ్చారన్నారు. దేశ రైతాంగం మంతా పోరాడి మూడు నల్ల చట్టాలను వెనక్కి కొడితే దొడ్డి దారిని వ్యవసాయ రంగాన్ని ప్రయివేటీకరించేందుకు మోడీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. ఐదెకరాల్లోపు రైతుకు రూ.18 వేలు ఇవ్వాలనే డిమాండ్‌ను పక్కనపడేసిందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు హామీ ఏమైందని ప్రశ్నించారు. కొత్తగా 60 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారని నిలదీశారు. బడ్జెట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు, దిష్టిబొమ్మల దహనాలు, సదస్సులు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ నాయకులు పైళ్ల ఆశయ్య, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.శోభన్, సీఐటీయూ కార్యదర్శులు జె.వెంకటేశ్, ఎస్వీ రమ, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు పద్మ, ఆయా సంఘాల నాయకులు ఆంజనేయులు, ఎం.శ్రీనివాస్, కె.రమేశ్, పి.శ్రీకాంత్, ఆర్.వాణి, ఎం.వెంకటేశ్, ఈశ్వర్రావు, యాటాల సోమన్న తదితరులు పాల్గొన్నారు.