Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాలెండర్ అవిష్కరణలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సినిమా థియేటర్లలో పనిచేసే కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఆ సంఘం ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆయన అవిష్కరించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కాలంలో సినిమా థియేటర్లలో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. ఇరవైఏండ్ల నుంచి పనిచేస్తున్న వారికి సైతం ఎలాంటి చట్టబద్ద హక్కులు లేవని వివరించారు. ఎక్కడికక్కడ, ఎవరికి వారు ఉండటం వల్ల వీరి సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు అమలు కావటం లేదనీ, ఈఎస్ఐ, పీఎప్ లేదని చెప్పారు.పనిభద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు.యజమానులు చట్ట విరుద్దంగా 18గంటలకు పైగా పనిచేయిస్తున్నారని విమర్శించారు. అయినా కార్మిక శాఖ కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శించారు.రాష్ట్రంలో 25వేల మందికి పైగా ఉన్న కార్మికులు తమ సమస్యలపై సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న హక్కుల్ని ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని చెప్పారు. లేబర్ కోడ్ల పేరుతో కనీస హక్కులు కూడా ఇక నుంచి అమలయ్యే పరిస్థితి లేదని తెలిపారు. రాబోయే కాలంలో అన్ని రంగాల కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయీస్ యూనియన్(టీసీటీఈయు) గౌరవాధ్యక్షులు మారన్న, అధ్యక్షులు మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అరుణ్, నాయకులు రామస్వామి, శ్రీనివాస్‌రెడ్డి, కమలాకర్ గౌడ్, వీర నారాయణ,అశోక్ భరత్ తదితరులు పాల్గొన్నారు.