Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మళ్లీ నిరాశే
- పన్నుల విధానంతో రూ.నాలుగు వేల కోట్లు నష్టం
- ఎఫ్ఆర్బీఎమ్ పరిమితి పెంపుతో లాభమేనా..?
- నదుల అనుసంధానం ఏ మేరకు ఉపయోగం..?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈసారి బడ్జెట్లో కేంద్రం మనకు ఇచ్చిందీ లేదు.. అక్కణ్నుంచి మనకు వచ్చిందీ లేదు. షరా మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం... తెలంగాణలోని పలు ప్రాజెక్టులు, పెండింగ్లో ఉన్న అంశాలకు సంబంధించి రాసిన లేఖలు బుట్టదాఖలయ్యాయి. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎమ్) పరిమితిని 3.5 శాతం నుంచి 4 శాతానికి పెంచిన నేపథ్యంలో రాష్ట్రాలు రూ.లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలను తీసుకోవచ్చంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పద్దులో పేర్కొన్నారు. ఈ అప్పును యాభై ఏండ్ల కాలంలో తీర్చవచ్చంటూ సూచించిన నేపథ్యంలో రుణాల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణకు అది ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. దీంతోపాటు కేంద్రం... కృష్ణా, గోదావరి, కావేరీ నదుల అనుసంధానమనే ప్రకటన చేసింది. ఇది మన రాష్ట్రానికి అది ఏ రకంగా ఉపయోగపడుతుందో వేచి చూడాలి. ఆ అనుసంధానాన్ని ఏ పద్ధతుల్లో చేస్తారు..? దానికోసం నిధులను ఎలా సర్దుబాటు చేస్తారనే విషయాలను మున్ముందు పరిశీలించాల్సి ఉంది. కాకపోతే ఎన్నికలు వచ్చిన ప్రతీసారి నదుల అనుసంధానమనే నినాదాన్ని ఎత్తుకోవటం బీజేపీకి ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలో అసలు ఆ ప్రక్రియ కేవలం నినాదంగానే ఉంటుందా..? లేక ఆచరణలోకి వస్తుందా..? అనేది పరిశీలించాల్సిన అంశం. మరోవైపు కేంద్ర పన్నుల వాటాలో తెలంగాణ 50 శాతాన్ని అడుగుతూ వచ్చింది. కానీ దాన్ని 41 శాతానికే పరిమితం చేయటం వల్ల రాష్ట్రం రూ.నాలుగు వేల కోట్లు నష్టపోతున్నది. కేంద్రానికి కరోనా సమయంలో కూడా ఆదాయం పెరిగింది. దాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయకపోవటం వల్ల తెలంగాణకు కూడా తీవ్ర నష్టం వాటిల్లనుంది.