Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభజన హామీలపై కేంద్రం రిక్తహస్తం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లో కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. అసలు అలాంటిదేం లేదన్నట్టే 2022-23 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వ్యవహరించారు. కనీసం గతంలో మంజూరైన ప్రాజెక్టుల అమలు కోసం నిధులైనా మంజూరు చేశారా అంటే అదీ లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులన్నీ కంఠశోషగా మిగిలాయేతప్ప, వాటిని కనీసం విన్న దాఖలా కూడా ఈ బడ్జెట్లో కనిపించలేదు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంపై ఎలాంటి పురోగతి ఈ బడ్జెట్లో లేదు. రాష్ట్రంలోని ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇస్తానని విభజన చట్టంలో కేంద్రం పేర్కొన్నది. ఏపీలో పోలవరానికి జాతీయ హౌదా ఇచ్చారు. తెలంగాణకు ఇచ్చిన హామీకి దిక్కూదివానం లేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వాలని నాలుగేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూనే ఉంది. ఈ బడ్జెట్లో అలాంటి హామీ ఒకటి ఉన్నదనే విషయాన్నే కేంద్రప్రభుత్వం విస్మరించింది. మరోవైపు విభజన చట్టం షెడ్యూల్ 9,10 లోని సంస్థల విభజన ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఇది కేంద్రప్రభుత్వ నిర్ణయంతో ముడిపడి ఉంది. దీనిపై కేంద్రప్రభుత్వం వేసిన కమిటీలు ఇప్పటికీ నివేదికల్ని ఇవ్వకపోవడంపై కనీస పట్టింపు ప్రదర్శించలేదు. అసెంబ్లీ స్థానాల పెంపు ప్రతిపాదనల ప్రస్తావనా లేదు. ఇది జరిగితే రాష్ట్రానికి నియోజకవర్గాల వారీగా కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కానీ కేంద్రం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాన్నీ చేయలేదు. అలాగే రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్వి భజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా రూ.450 కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. గడచిన ఐదేండ్ల్లలో నాలుగు సార్లు ఇచ్చారు మరో ఏడాదికి సంబంధించిన నిధులు రావల్సి ఉంది. వాటి గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదు. కేంద్ర తాత్సారం, కేటాయింపులు లేకపోవడంతో విభజన హామీల అమలు మళ్లీ మొదటికే వచ్చినట్టు అయ్యాయి.