Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవసరాలను విస్మరించిన సర్కార్
- నీరుగారిన ఆశలు
- ప్రోత్సాహాకాలు అంతంత మాత్రమే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగులంటేనే సహకరించని శరీరాలు. ఏ పని చేయాలన్నా కష్టమే. వీరు ఏదో ఒక చోట నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన ప్రభుత్వమే తాజా బడ్జెట్లో వారి సంక్షేమాన్ని గాలిలో దీపంలా మార్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో వీరికి మంచి కేటాయింపులు జరుగుతాయిలే అని ఎదురు చూసిన వికలాంగులకు నిరాశే మిగిలింది. మొత్తం బడ్జెట్లో వికలాంగులకు ఏ మేరకు కేటాయించాలో చట్టాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. కానీ..సర్కార్ వారి సంక్షేమానికి తగిన రీతిలో కేటాయింపులు చేయటం లేదు. దేశంలో రెండు కోట్లకు పైగా వికలాంగులు ఉన్నారు. రాష్ట్రంలో ఏడు రకాల వైకల్యం కలిగిన వారిని లెక్కిస్తేనే..10,46,820మంది వికలాంగులున్నారు. వాస్తవంగా 21రకాల వైకల్యం కలిగిన వారున్నారు. వీరందరినీ లెక్కిస్తే తెలంగాణలో సుమారు 20లక్షలకు పైగా ఉంటారని అంచనా. దేశంలోనూ సుమారు రెండు కోట్లకు పైగా వివిధ రకాల వికలాంగులున్నారు. వీరి సంక్షేమం, అవసరాల ఆధారంగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన లేదు. ప్రతి బడ్జెట్లో నిధులు పెంచినట్టు అంకెల్లో చూపిస్తున్నప్పటికీ..ఖర్చు చేయట్లేదని సంఘాలు చెబుతున్నాయి. కోవిడ్ వల్ల అందరికంటే ఎక్కువగా కష్టాలు ఎదుర్కొన్నది వికలాంగులే. అయినా వీరిని తగిన రీతిలో ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమయింది. అదే విధంగా పెరిగిన ధరల వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ ఏ మాత్రం సరిపోవటం లేదని వారు వాపోతున్నారు. పెండ్లి, ఇతర సందర్భాల్లో ఇస్తున్న ప్రోత్సాహాకాలు కూడా తగిన రీతిలో లేవు. దేశ వ్యాప్తంగా ఒకే పెన్షన్ విధానాన్ని ప్రకటిస్తామని చెప్పినా ఆచరణలో అమలు కావటం లేదు.దీంతో వారు మరింత నిర్లక్ష్యానికి గురవుతున్నారు.
అవసరాలను విస్మరించిన కేంద్ర బడ్జెట్
రాష్ట్రపతి ప్రసంగ స్ఫూర్తికి భిన్నం:ఎన్పీఆర్డీ
వికలాంగుల అవసరాలను విస్మరించే విధంగా , రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తి కి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) ఆవేదన వ్యక్తం చేసింది. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం వికలాంగులలో మళ్లీ ఆశలు చిగురించేలా చేసిందని తెలిపింది. వికలాంగులకు ''ప్రాప్యత, సమానత్వం, గౌరవప్రదమైన జీవితం'' అనేది ''సమాజంగా మన సమిష్టి బాధ్యత'' అని నొక్కిచెప్పారు. 2022-23 బడ్జెట్‌ను పరిశీలిస్తే.. అటువంటి ఆశలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. అయితే ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్కో)కి కూడా కేటాయింపులు పెరిగాయి. వాటి తయారీలో పారదర్శకతను పాటించి వికలాంగులకు చేయూతేనందించేలా ఉండాలి. మహమ్మారి యొక్క ప్రతికూల అనుభవం ఉన్నప్పటికీ, వికలాంగులందరికీ ఉచిత, సార్వత్రిక ఆరోగ్య కవరేజీ డిమాండ్‌ను పట్టించుకోవటానికి ప్రభుత్వం నిరాకరించింది. నిరుద్యోగ వికలాంగుల భారీ సైన్యానికి హామీ ఇవ్వడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ రంగ యూనిట్ల ప్రయివేటీకరణ, మహమ్మారి సమయంలో భారీగా ఉద్యోగాలు కోల్పోవడం వల్ల వికలాంగులు ఏర్పాటు చేసిన చిన్న వ్యాపారాలకు రుణాలు అందించేందుకు వీలుగా జాతీయ వికలాంగుల ఆర్థిక మరియు అభివృద్ధి కార్పొరేషన్‌కు కేటాయింపులు గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. గత బడ్జెట్లో దీన్ని భారీగా తగ్గించింది. పెరుగుతున్న ధరలు, వికలాంగ సంబంధిత ఖర్చులు ఉన్నప్పటికీ, కేంద్రం వికలాంగుల పెన్షన్‌ను పెంచడానికి నిరాకరిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్పీఆర్డీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎం జనార్ధన్‌రెడ్డి, అధ్యక్షులు కె వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య ఒక ప్రకటన విడుదల చేశారు.