Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదించిన 2022-23 బడ్జెట్ మైనారిటీల సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించిందనీ, జస్టిస్ రాజేందర్ సచార్ కమిషన్ సిఫార్సులకనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు లేవని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జస్టిస్ రాజేందర్ సచార్ కమిషన్ మైనారిటీల అభివృద్ధికి బడ్జెట్లో కనీసం 10శాతం నిధులు కేటాయించాలని సూచించిందని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం 0.12శాతం కేటాయింపులు జరిపి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. దేశ జనాభాలో 15శాతంగా ఉన్న మైనారిటీల సంక్షేమానికి ఈ నిధులు ఎలా సరిపోతాయో చెప్పాలని ప్రశ్నించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి, పేదరికంలో మగ్గుతున్న మైనారిటీల అభివృద్ధిని కేంద్రం పట్టించుకోవడం లేదనే విషయం బడ్జెట్ కేటాయింపులు చూస్తే స్పష్టమవుతోందని తెలిపారు. రూ. 39లక్షల కోట్ల బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి కేవలం రూ. 5వేలకోట్లు ప్రతిపాదించటం వారి సంక్షేమాన్ని విస్మరించటమేనని తెలిపారు. దేశ సగటు కంటే అక్షరాస్యతలో ముస్లిం మైనార్టీ మహిళలు వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. ఎన్.ఎస్.ఎస్.ఓ సర్వే ప్రకారం ముస్లిం మైనార్టీ పిల్లలలో 22శాతం మంది కనీసం బడి ముఖం కూడా చూడటం తెలిపారు. వారి విద్యపై కేంద్రీకరించాల్సిన అవసరం ఉందనీ, మైనారిటీల విద్యకు కేటాయించిన నిధులు రెండు వేల ఐదు వందల కోట్లు మాత్రమేనని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రాపౌట్స్ పిల్లలను తిరిగి బడి బాట పట్టించే నయీ మంజిల్ స్కీంకు కోతలు విధిస్తూ వచ్చారని తెలిపారు. 90శాతానికి పైగా చిన్న, చిన్న వృత్తులు చేసుకుని జీవిస్తున్న వారికి స్కిల్ డెవలప్మెంట్ పథకాలు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. వృత్తి నైపుణ్య పథకాలకు ఇస్తున్న నామమాత్రపు నిధులకు కూడా కోతలు విధించారని తెలిపారు. జాతీయ మైనారిటీ ఆర్థికాభివృద్ధి సంస్థ పేరుకే మిగిలిందని పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం ముస్లిం మైనార్టీలకు బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదనీ, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలున్న దేశంలో జాతీయ మైనారిటీ ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్ఎంఎఫ్డీసీ)కి కేవలం162కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో మైనారిటీల అభివృద్ధి ఎలా సాధ్యమో చెప్పాలని ప్రశ్నిం చారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జస్టిస్ రాజేందర్ సచార్ కమిషన్ సిఫార్సులకనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు పెంచాలని విజ్ఞప్తి చేశారు.