Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర బడ్జెట్లో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో20శాతం ఉన్న దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం దళితులను విస్మరించిందని పేర్కొన్నారు. గత బడ్జెట్లో కేటాయించిన నిధులనూ ఖర్చు చేయలేదని ఆరోపించారు. అంకెల్లో కేటాయింపులు పెరుగుతున్నాయి కానీ.. ఖర్చు చేయకపోవటం వల్ల సంక్షేమం ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. 2022-23 బడ్జెట్లో రూ. 39.45 లక్షల కోట్లలో దళిత సంక్షేమానికి రూ. 11,922 కోట్లు మాత్రమే కేటాయించినట్టు పేర్కొన్నారు. ఆ నిధుల్ని దారిమళ్లిస్తున్నారని తెలిపారు. సబ్ ప్లాన్ బడ్జెట్లో కూడా అంకెలు పెంచి, అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. రూ.1,42, 342 ఈ వార్షిక సంవత్సరం కేటాయింపులు చూపుతున్న ప్రభుత్వం, గత బడ్జెట్ ఖర్చుల్లో ఎందుకు పారదర్శకతను ప్రదర్శించలేదో చెప్పాలనీ, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్య వైద్యం గృహ నిర్మాణం వంటి అంశాల్లో కేటాయింపులు తగ్గాయని పేర్కొన్నారు. కేటాయించిన నిధులు పారదర్శకంగా ఖర్చు చేయడానికి దళిత మేధావులు సంఘాలతో కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.