Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతా డిజిటలీకరణవైపే మొగ్గు
- విద్యాసంస్థల్లో వసతుల కల్పనపై దృష్టిసారించని కేంద్రం
- ఏటా తగ్గుతున్న నిధుల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యాకార్పొరేటీరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. అంతా డిజిటీకరణకే మొగ్గుచూపుతున్నది. 2022-23 బడ్జెట్లో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. ఇంకోవైపు 'వన్ క్లాస్- వన్ టీవీ ఛానెల్ పథకం'లో భాగంగా 200 టీవీ ఛానెళ్లకు విస్తరించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి ఈ విద్య కింద టీవీ ఛానెళ్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే కార్పొరేట్ విద్యాసంస్థల కోసమే ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఛానెళ్ల ద్వారా పాఠాలు ప్రసారం చేయాలంటే ప్రతి పాఠశాలకూ అధునాతన ఎల్ఈడీ ప్రొజెక్టర్లు, టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి. తరగతి గదులు, కరెంటు సౌకర్యం వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉంటాయి. అయితే కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఈ విద్య పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిందన్న విమర్శలు వస్తున్నాయి. డిజిటల్ టీచర్ల ద్వారా అత్యున్నమైన ఈ కంటెంట్‌ను రూపొందించి విద్యార్థులకు అందించాలని నిర్ణయించింది. ఇదీ గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉపయోగపడేలా లేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ కంటెంట్‌ను వినియోగించుకోవాలంటే విద్యార్థులకు డిజిటల్ ఉపకరణాలు అవసరమవుతాయి. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్టుగా కనిపించడం లేదు. ఇంకోవైపు ఏటా విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపును తగ్గిస్తున్నది. 2022-23 బడ్జెట్లో విద్యారంగానికి రూ.1,04,277 (2.64 శాతం) కోట్లు కేటాయించింది. ఇందులో పాఠశాల విద్యకు రూ.63,449 కోట్లు, ఉన్నత విద్యకు రూ.40,828 కోట్లు ప్రతిపాదించింది. 2021-22 బడ్జెట్లో విద్యారంగానికి 93,224 (2.7 శాతం) నిధులు కేటాయించింది. అదే 2014-15 బడ్జెట్లో విద్యకు 3.7 శాతం నిధులను ప్రతిపాదించింది. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగానికి ప్రాధాన్యతను తగ్గిస్తున్నది. ఏటా నిధులను తగ్గిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నది. నూతన విద్యావిధానం-2020 ద్వారా విద్యా ప్రయివేటీకరణ, ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణకు పాల్పడుతున్నదని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇంకోవైపు రాష్ట్రానికి విభజన చట్టంలో హామీ ఇచ్చిన విద్యాసంస్థలనూ కేటాయించడం లేదు. తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి ఏపీతో కలిపి రూ.43 కోట్లు కేటాయించింది. నవోదయ విద్యాలయాలు, ఐఐఎం, త్రిపుల్‌ఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) వంటి వాటినీ ఈ బడ్జెట్లో మంజూరు చేయకుండా విస్మరించింది.
విద్యారంగానికి 10 శాతం నిధులు కేటాయించాలి : ఎస్ఎఫ్ఐ
విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో పదిశాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు డిమాండ్ చేశారు. బడ్జెట్లో నిధులను తగ్గించడం వల్ల నూతన విద్యావిధానం లక్ష్యాలు నెరవేరబోవని తెలిపారు. డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం విద్యారంగానికే పెనుప్రమాదమని విమర్శించారు. భవిష్యత్తులో విద్యారంగాన్ని ప్రయివేటు, కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టే కుట్రలో భాగంగానే దీన్ని నెలకొల్పుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రత్యక్ష బోధనకు భిన్నంగా డిజిటల్ విద్యను ప్రోత్సహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇందుకోసం డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. విద్యాకేంద్రీకరణ పెరగడంతోపాటు కొన్ని సెక్షన్ల వారికే చదువు అందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ విద్య వల్ల అసమానతలు పెరిగాయనీ, డ్రాపౌట్స్ పెరిగారని వివరించారు. ఆదివాసీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. డిజిటల్ వర్సిటీ అంటే కార్పొరేట్ శక్తులకే అవకాశముంటుందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ విద్యారంగాన్ని మార్చేలా లేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో విద్యారంగ కేటాయింపులకు నిరసన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.