Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగిన కేటాయింపుల కోసం రాజకీయ పార్టీలు ఒత్తిడి తేవాలి : తెలంగాణ పౌరస్పందన వేదిక డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా సమయంలోనూ కేంద్ర బడ్జెట్లో విద్యావైద్య రంగాలకు ప్రాధాన్యతనివ్వకపోవడం అమానుషమని తెలంగాణ పౌరస్పందన వేదిక విమర్శించింది. ఈ మేరకు వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బడ్జెట్ సాధారణ ప్రజానీకానికి ఎంతో నిరాశ కలిగించిందని తెలిపారు. 2021-22 బడ్జెట్ కంటే ఈసారి విద్యారంగానికి రూ.11,054 కోట్లు అధికంగా కేటాయించినట్టు చూపినా మొత్తం బడ్జెట్లో ఇది 2.64 శాతం మాత్రమేనని వివరించారు. కొఠారి కమిషన్ నివేదిక ప్రకారం కేంద్ర బడ్జెట్లో పదిశాతం లేదా జీడీపీలో మూడు శాతం విద్యారంగానికి ఖర్చు చేయాలని సిఫారసు చేసిందని గుర్తు చేశారు. వైద్యరంగానికి సంబంధించి ఈ బడ్జెట్లో రూ.86,200 కోట్లు కేటాయించారని తెలిపారు. 2021-22 బడ్జెట్‌తో (రూ.73,931 కోట్లు) పోల్చినపుడు పెంపుదల కేవలం 0.23 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌కు గత బడ్జెట్లో కేటాయించిన రూ.39 వేల కోట్లను ఈ బడ్జెట్లో రూ.5 వేల కోట్లకు కుదించారని వివరించారు. దీనివల్ల ప్రజారోగ్యంపై వెచ్చించే మొత్తం రూ.74,820 కోట్ల నుంచి రూ.41,011 కోట్లకు పడిపోయిందని తెలిపారు. ప్రఖ్యాత అధ్యయన సంస్థ ఐసీఆర్ఏ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ విధమైన నామమాత్రపు పెంపుదలతో 2025 నాటికి జీడీపీలో 2.5 శాతం ఆరోగ్య రంగానికి కేటాయించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని పేర్కొన్నారు. అత్యంత ధనవంతులైన పది శాతం కార్పొరేట్లపై ఒక శాతం ఆస్తిపన్ను పెంచితే మూడేండ్లలో దేశంలో విద్యా, వైద్య రంగాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లొచ్చని సూచించారు. కానీ కార్పొరేట్ సర్ఛార్జీని ఐదు శాతం తగ్గించడం ఈ బడ్జెట్ ఎవరికి ఉపయోగమో తెలియజేస్తున్నదని తెలిపారు. దేశ భవిష్యత్‌కు, అభివృద్ధికి కీలకమైన విద్యావైద్య రంగాలకు కేటాయింపులు, ప్రత్యేకించి కరోనా అనుభవం తర్వాత మెరుగ్గా ఉంటుందంటూ మేధావులు, ఆర్థిక వేత్తల నుంచి పేద, మధ్య తరగతి ప్రజానీకం వరకూ అందరూ ఆశించారని తెలిపారు. విద్యకు పది శాతం, వైద్యరంగానికి ఆరు శాతం తగ్గకుండా కేటాయింపులు జరిగేలా ఒత్తిడి చేయాలనీ, అన్ని రాజకీయ పార్టీలూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.