Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగుల పరస్పర బదిలీలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి జీవోనెం.21ను విడుదల చేసింది. సంబంధిత దరఖాస్తులను మార్చి ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు స్వీకరిస్తారు. అయితే బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్‌ను ప్రింటవుట్ తీసి జిల్లా, జోనల్ అధికారి ద్వారా శాఖాధిపతుల కార్యాలయానికి పంపుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ కావాలనుకునే వారు ఒకే యాజమాన్యం, ఒకే క్యాటగిరీ, ఒకే శాఖ, ఒకే మీడియం పరిధి వారై ఉండాలి. పరస్పర బదిలీకి సంబంధించి ఒక్కరు... ఒక్కరికి మాత్రమే అంగీకారమివ్వాలి. ఒకసారి దరఖాస్తు ఇస్తే దాన్నే ఫైనల్ అప్లికేషన్‌గా పరిగణిస్తారు.
మళ్లీ మళ్లీ మార్చేందుకు వీలుండదు. బదిలీలకు ఇష్టపడే ఇద్దరిలో ఒకరు తప్పనిసరిగా రాష్ట్రపతి ఉత్తర్వులు- 2018 ద్వారా వేరే జిల్లా, లేదా ప్రాంతానికి బదిలీ అయ్యుండాలి. పరస్పర బదిలీని కోరుకునే ఇద్దరు, వారు బదిలీ అయిన లోకల్ క్యాడర్లో జూనియర్‌గా ఉండటానికి ఇష్టపడుతూ హామీపత్రాన్ని సమర్పించాలి. దీని వల్ల సీనియార్టీని కోల్పోతారనే విషయాన్ని గుర్తించాలని జీవోలో స్పష్టం చేశారు.