Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు లేఖ రాసిన మల్లన్నసాగర్ నిర్వాసితులు
నవతెలంగాణ-తొగుట
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామనీ, పెండింగ్ నష్టపరిహారంతో పాటు తమ సమస్యలను తీర్చాలని ప్రాజెక్టు భూ నిర్వాసితులు ముఖ్యమంత్రి కేసీఆర్కు బుధవారం లేఖ రాశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. తమకు రావాల్సిన పెండింగ్ పరిహారాలు వెంటనే అందించాలని లేఖలో పేర్కొన్నామన్నారు. అంతేకాకుండా ముంపు గ్రామాల నిర్వాసితులకు ఖాళీ స్థలాలు, కొందరికి ఇండ్ల పరిహారాలు, బోరు బావులు, గ్రామాన్ని ఖాళీ చేసే సమయంలో ప్రతి కుటుంబానికీ రూ. లక్ష పరిహారం ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్తామన్న ఓపెన్ ప్లాట్ల ఊసే ఎత్తడం లేదన్నారు. నిర్వాసిత గ్రామాల్లో మృతి చెందిన వారిని దహన సంస్కారాలు చేసేందుకు శ్మశానవాటికలు కూడా లేవనీ, వెంటనే ఏర్పాటు చేయాలని లేఖలో తెలిపామని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ముందుగా నిర్వాసితులకు అందించాలని కోరారు. ప్రాజెక్టులో చేపలు పట్టుకునే హక్కు నిర్వాసితులకు కల్పించాలనీ, ఆర్అండ్ఆర్ కాలనీలో ప్రతి ఒక్కరికీ మేలు చేకూరాలని విజ్ఞప్తి చేశారు.