Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 105 సార్లు సవరించింది కాంగ్రెస్, బీజేపీలు కావా?
- కేసీఆర్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది?
- ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ముమ్మాటికి బైబిల్ లాంటిదేనని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల పేదలకు న్యాయం జరగాలంటే కొత్త రాజ్యాంగం రచించుకోవాలంటూ కేసీఆర్ వ్యాఖ్యానించిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించాయని గుర్తుచేశారు. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమి లేదని విమర్శించారు. అంబేద్కర్ పై నిజంగా ప్రేముంటే దేశవ్యాప్తంగా దళిత బంధు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాజ్యాంగంలో 50 శాతం వరకే రిజర్వేషన్లు ఇస్తున్నారనీ, అవి పెంచుకోవాలంటే కొత్త రాజ్యాంగం అవసరమన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ పాలన కొనసాగుతున్నదన్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ ఐదు దశాబ్దాల అనుభవంతో కేసీఆర్ ఈ దేశానికి ఏమి కావాలనే అంశంపై తన ఆలోచనలు పంచుకున్నారని తెలిపారు. పొరుగు దేశాలు సాధిస్తున్న ప్రగతి భారత దేశం ఎందుకు సాధించడం లేదని ప్రశ్నించారు. దేశ ప్రగతి కోసం చర్చను లేవనెత్తారని చెప్పారు. కొత్త రాజ్యాంగంపై చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్, బీజేపీలు పారిపోతున్నాయనీ, తమ వైఖరి చెప్పకుండా ఆ రెండు పార్టీలు సీఎం కేసీఆర్పై ఆందోళనలకు పిలుపునిచ్చాయని తప్పుపట్టారు. అంబెద్కర్ ను అవమానించిన అరుణ్ శౌరిని కేంద్ర మంత్రి చేసింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు.