Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలి
- ప్రజల్ని రెచ్చగొట్టుడు మానుకోండి : ప్లానింగ్ కమిషన్ వైస్‌చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అప్పటి భారత ప్రధాని వాజ్‌పేయి రాజ్యాంగ పని తీరు సమీక్షకు న్యాయ నిపుణులతో కమిషన్ వేశారనీ, జస్టిస్ వెంకటాచలయ్య నేతత్వంలో కమిషన్ 2002 లో వాజపేయికి నివేదిక సమర్పించిందని రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చర్చ జరగాలని మాత్రమే అన్నారని స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ నేతలు సవాళ్లు విసరడం మానుకోవాలని హితవు పలికారు. బుధవారంనాడాయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ రాజ్యాంగంపై చర్చ కొత్త అంశం ఏమీ కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జస్టిస్ రాజమన్నార్ కమిషన్ వేశారనీ, కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై జస్టిస్ సర్కారియా కమిషన్ వేశారని వివరించారు. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలనీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు. అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి రాజ్యాంగం పని తీరుపై జస్టిస్ వెంకటాచలయ్యా నేతత్వంలో న్యాయ నిపుణులు సోలీ సొరాబ్జీ, పరాశరన్, సర్కారియా, జీవన్ రెడ్డి, పున్నయ్య, సుభాష్ కశ్యప్ వంటి వారితో కమిషన్ వేశారని గుర్తు చేశారు. రాజ్యాంగ మూలాల్లో మార్పులు జరగరాదన్నది సుప్రీం కోర్టు ప్రధాన ఉద్దేశ్యం అనీ, దేశ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చని అంబేద్కర్ చెప్పారనీ, దీనికోసం ఆర్టికల్ 368 ద్వారా అవకాశం కల్పించారని తెలిపారు. ఈ ఆర్టికల్ ద్వారా మూడు రకాల పద్ధతుల్లో రాజ్యాంగ సవరణలకు అవకాశం ఉందన్నారు. పార్లమెంటు సింపుల్ మెజారిటీతో కానీ, లోక్ సభ, రాజ్యసభ లో 2/3 మద్దతుతో మార్చుకోవచ్చనీ, దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదంతో కూడా మార్చుకోవచ్చని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చర్చ జరగాలని మాత్రమే చెప్పారనీ, రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం, నదీజలాల సమస్యలను పరిష్కరించకపోవడం, జీఎస్టీ వంటి అనేక అంశాలను దష్టిలో ఉంచుకుని ఆయన ఆ అంశాన్ని ప్రస్తావించారని వివరణ ఇచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దానిలోభాగంగానే జమిలి ఎన్నికల అంశం తెరపైకి తెస్తున్నారని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ కూడా పాల్గొన్నారు.