Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ క్యాలెండర్ ఆవిష్కరణలో మహమ్మద్ అబ్బాస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో పోరాటాలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ తెలిపారు. హైదరాబాద్లోని ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో తమ సర్వస్వాన్ని త్యాగం చేసి, గుర్తింపుకు నోచుకోని సమరయోధులను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని భావించి, ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలతో ్ ఆవాజ్ క్యాలెండర రూపొందించిందన్నారు. ప్రస్తుతం మతోన్మాదులు చరిత్రకు వక్రభాష్యం చెబుతున్నారు, వక్రీకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములు కాని మతోన్మాదులు, ముస్లిం మైనార్టీల దేశభక్తి గురించి ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. దేశ ప్రజలను ప్రేమించి, వారి అభివృద్ధికి పాటుపడటమే నిజమైన దేశభక్తి అని, ద్వేషాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బంగడుపుకోవడం కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర కోశాధికారి షేక్ అబ్దుల్ సత్తార్, ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, గులాం నశీర్ యాకూబ్, ఖాజా గరీబ్, రోషన్ తదితరులు పాల్గొన్నారు.