Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కారు చర్యలను ఎండగట్టాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు తీవ్ర చర్యనీయాంశంగా మారాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త రాజ్యాంగం తేవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైతే దాన్ని సవరించేందుకు రాజ్యాంగ నిర్మాతలు అవకాశమిచ్చారని గుర్తు చేశారు. అంబేద్కర్ నేతృత్వంలో మేధావులు భారతదేశ వైవిధ్యం, బహుళత్వాన్ని పరిగణనలోకి తీసుకుని దూరదృష్టితో రాజ్యాంగాన్ని రచించారని వివరించారు. అందులోని మౌలికాంశాలను మార్చేందుకు బీజేపీ, సంఫ్‌ుపరివార్ శక్తులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగ పీఠిక నుంచి లౌకికవాదం, సోషలిజం పదాలను తొలగించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త రాజ్యాంగం అనే చర్చ తేనెతుట్టే కదిపి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలిగే ప్రమాదముందని పేర్కొన్నారు. నేడు రాజ్యాంగం సమతుల్యంగా, దేశ సమగ్రత, సమైక్యతను బలోపేతం చేసేదిగా ఉందని వివరించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తి భిన్నంగా కేంద్రం పోకడలు దుర్మార్గమని తెలిపారు. ప్రభుత్వరంగం, లౌకిక వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నదని పేర్కొన్నారు. ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే మోడీ సర్కారు చర్యలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం అనుసరిస్తున్న రాజ్యాంగ ఉల్లంఘనలపై ఆందోళనకు పూనుకోవడమొక్కటే పరిష్కారమని తెలిపారు.