Authorization
Tue April 08, 2025 06:06:22 pm
- ఎస్వీకేలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ డైరీ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయటం ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ యూనియన్ రూపొందించిన 2022 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పారిశుధ్య పనులు చేపడతూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న గ్రామపంచాయతీ సిబ్బంది పట్ల రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వహించడం తగదని విమర్శించారు. వారికి నామమాత్రపు వేతనాలిచ్చి వెట్టిచాకిరీ చేయించుకోవడం దారుణమన్నారు. వారికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదనీ, లేబర్ కోడ్ల పేరుతో కనీస హక్కులు కూడా అమలుకు నోచుకోని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెలో పంచాయతీ కార్మికులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.గణపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు తునికి మహేష్, వినోద్, పి.మహేష్, అప్పిరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సుధాకర్, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వర్, రాజలింగు, జి. పాండు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.