Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడున తహసీల్దార్, 10న కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు : తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘాల(వీఆర్ఏ)జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న చలో ఇందిరాపార్కు(చలో హైదరాబాద్)కు పిలుపునిస్తున్నట్టు తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘాల (వీఆర్ఏ) ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. అందుకు సన్నద్ధంగా ఈ నెల ఏడో తేదీన మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట, పదో తేదీన కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు వెల్లడించింది. బుధవారం జేఏసీ సమావేశం ఆన్లైన్లో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రిక్రూట్మెంట్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వెంకటేశ్, కె.బాబుదేవ్, తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అమ్ముల బాలనర్సయ్య, వంగూరు రాములు మాట్లాడారు. వీఆర్ఏల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని వెనుకబడిన సామాజిక తరగతుల వారేననీ, వాళ్లు కొన్ని తరాలుగా అతి తక్కువ వేతనంతో విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. వారికి పే-స్కేలు జీవోను విడుదల చేయాలనీ, అర్హత కలిగిన వారికి ఉద్యోగోన్నతులు ఇవ్వాలని కోరారు. ఇచ్చిన హామీ మేరకు వారికి సొంత గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వాటన్నింటిపైనా సీఎం హామీనిచ్చి 18 నెలలు దాటుతున్నా ఆచరణ రూపంలోకి రాలేదన్నారు. వీఆర్ఏలకు డబుల్ బెండ్ రూము ఇండ్లు కట్టిస్తామని ప్రగతిభవన్లో సీఎం ఇచ్చిన హామీ ఐదేండ్లు దాటినా పట్టాలెక్కలేదని విమర్శించారు. హక్కులు, డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ జేఏసీ తలపెట్టిన కార్యాచరణను వీఆర్ఏలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎస్కె. దాదేమియా, ఎల్.నర్సింహారావు, బి. రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.