Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగులను మోసగించిన కేంద్రం : డీవైఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర బడ్జెట్ యువతకు ఎండమావే చూపిందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) విమర్శించింది. ఈ మేరకు డీవైఎఫ్ఐ అఖిల భారత కార్యదర్శివర్గ సభ్యులు ఎ విజరుకుమార్, రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి అనగంటి వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగులను కేంద్ర ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసిందని విమర్శించారు. వచ్చే ఐడేండ్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు తయారు చేస్తామంటూ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం యువతను నట్టేట ముంచడమేనని తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ ఎటుపోయిందని ప్రశ్నించారు. ఆ హామీని పక్కనపెట్టి మరో కొత్త మాటలు వల్లించడం యువతను మోసం చేయడమేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదని పేర్కొన్నారు. ఐదేండ్లలో భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పే స్కిల్ ఇండియా, పీఎంకేవీవై వంటి పథకాలకు కేటాయింపులు తగ్గాయని వివరించారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజనకు ఈ బడ్జెట్లో కేవలం రూ.2,613 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. స్కిల్ ఇండియాకు ఈ బడ్జెట్లో రూ.1,717 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ అరకొర నిధులతో స్కిల్ ఇండియా సాధ్యమా?అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.16 కోట్లతో దేశంలో క్రీడలు ఎలా అభివృద్ధి చెందుతాయని అడిగారు. సమగ్ర క్రీడావిధానం రూపొందిస్తేనే భారత్ క్రీడల్లో నెంబర్‌వన్‌గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత సమగ్రాభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదపడబోదని తెలిపారు. వారిని విస్మరించకుండా సరైన కేటాయింపులు చేయాలనీ, శిక్షణ ఇవ్వాలని కోరారు.
విద్యారంగం పట్ల పాలకుల నిర్లక్ష్యం : పీడీఎస్‌యూ
విద్యారంగం పట్ల పాలకుల నిర్లక్ష్యం దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మామిడికాయల పరశురాం, ఈ విజరుఖన్నా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన (రూ.39,44,909) బడ్జెట్లో విద్యారంగానికి నామమాత్రపు (2.64 శాతం) నిధులు కేటాయించడం వల్ల భారతదేశ విద్యారంగం తిరోగమనంలో పడనుందని తెలిపారు. కొఠారి కమిషన్ సూచనల మేరకు కేంద్ర బడ్జెట్లో పది శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం, జీడీపీలో ఆరు శాతం నిధులు ఆ రంగానికి కేటాయించాలని సూచించారు. అప్పుడే దేశంలో మెజారిటీగా ఉన్న దళిత, గిరిజన అణగారిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు, విద్యాసంస్థల్లో మౌలిక సౌకర్యాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఏడేండ్ల పాలనలో కార్పొరేట్ సంస్థలకు ఏజెంట్‌గా మారి ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయకుండా తీరనిద్రోహం చేస్తున్నదని విమర్శించారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
విద్యారంగానికి మొండిచేయి : ఏఐఎస్ఎఫ్
బడ్జెట్లో విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్‌స్టాలిన్, కార్యదర్శి రావి శివరామకృష్ణ విమర్శించారు. విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకే బడ్జెట్లో నిధులను తగ్గించారని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో పదిశాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని పలు నివేదికలు చెప్తున్నా మోడీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఏటా తగ్గిస్తున్నదని పేర్కొన్నారు. విద్యారంగానికి 2.64 శాతం నిధులు కేటాయించడం కేంద్రం వివక్షతకు నిదర్శనమని విమర్శించారు. డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం ద్వారా విద్యా కేంద్రీకరణ పెరుగుతుందని తెలిపారు. విద్యారంగంలో అసమానతలు పెరుగుతాయనీ, ఆదివాసీ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఇంటర్నెట్ సౌకర్యం లేక నష్టపోతారని వివరించారు.