Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంజాయి పట్టివేత
- ఇద్దరు అరెస్ట్, డీసీఎం స్వాదీనం
- పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి
నవతెలంగాణ-జనగామ
ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ. 2.36 కోట్లు విలువ చేసే గంజాయిని పట్టుకున్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. బుధవారం వరంగల్ జిల్లాలోని వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. డీసీఎంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న గంజాయిని జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల శివారులోని ఆర్టీసీ కాలనీ వద్ద పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. అరెస్టు చేసిన వారిలో మహాబూబ్‌నగర్ జిల్లాలోని పెబ్బెరు గ్రామానికి చెందిన ఆడుల ప్రభాకర్, హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన నటేకర్ మహేశ్ ఉన్నట్టు తెలిపారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. పరారీలో ఉన్న ఖాజా గతంలో ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డట్టు చెప్పారు. మిగిలిన నలుగురు సైతం పలు కేసుల్లో నిందితులన్నారు. వీరంతా మంగళవారం డీసీఎంలో గంజాయిని తరలిస్తుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై జనగామ పట్టణం నెల్లుట్ల వద్ద లింగాల ఘనపురం, నెల్లుట్ల పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కలిసి సాయంత్రం వాహనాలను తనిఖీ చేశారు. డీసీఎం వాహనంలో ఎరువుల బస్తాల మధ్య ఉంచి తరలిస్తున్న 56 గంజాయి బస్తాలను పోలీసులు గుర్తించారు. గంజాయిని తూకం వేయగా సుమారు 16 క్వింటాళ్లు ఉన్నట్టు తెలిపారు. పెద్దఎత్తున గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం, టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జి, అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ రఘచందర్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సంతోష్ ప్రవీణ్‌కుమార్‌ను సీపీ అభినందించారు.