Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతరాములు
నవతెలంగాణ-గరిడేపల్లి
ప్రజాపోరాటాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడి అమరులైన నాయకుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతరాములు అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ఇటీవల మృతిచెందిన జుట్టుకొండ నారాయణ సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు. నారాయణ చిత్రపటానికి చెరుపల్లి పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు. నారాయణ ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. చిన్ననాటి నుంచి ఎర్రజెండా సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాపోరాటాలు నిర్వహించారన్నారు.కడదాకా ఎర్రజెండా ఆశయాల కోసం పోరాడిన యోధుడన్నారు. దోపిడీ లేని సమాజం కోసం నిరంతరం పాటుపడ్డార న్నారు.ప్రజాబలం ముందు ఏదీ గొప్పది కాదన్నారు. అందరికీ న్యాయం జరగాలని ఎర్రజెండా కోరుతుందన్నారు. కానీ ప్రస్తుతం అందరూ పని చేస్తే.. 20 శాతం మంది మాత్రమే అనుభవిస్తున్నారన్నారు. వారి చేతుల్లోనే అన్నీ ఉంటున్నాయన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడి, మల్లు లక్ష్మీ, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, ప్రజాకళాకారులు గద్దర్ తదితరులు పాల్గొన్నారు.