Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంలకు సింగరేణి సీఎమ్‌డీ టార్గెట్లు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిలిగిన రెండు నెలల్లో రోజుకు కనీసం 2.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అదే పరిమాణంలో రవాణా జరపాలని సింగరేణి కాలరీస్ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ అధికారులకు టార్గెట్లు విధించారు. వాటితో పాటు రోజుకు కనీసం 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలనీ ఆదేశించారు. నెలవారీ ఉత్పత్తి లక్ష్యాల సమీక్షలో భాగంగా బుధవారంనాడాయన హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి డైరెక్టర్లు, అడ్వయిజర్లు, ఏరియాల జీఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భారీ యంత్రాల వినియోగాన్ని ప్రస్తుత 13 గంటల సమయం నుంచి 18 గంటలకు పెంచాలని, ఈ మేరకు కార్మికులను చైతన్య పరచాలని చెప్పారు. కొత్తగూడెం సత్తుపల్లి రైలు మార్గాన్ని మార్చి నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. భూపాల పల్లి ఏరియాలో కేటీకే ఓసీ-2, ఓసీ-3, రామగుండం-3 ఏరియాలోని ఆర్జీ ఓసీ-2, రామగుండం -2 ఏరియాలోని ఆర్జీ ఓసీ-3 గనులకు సంబంధించిన భూ సేకరణ పనులు, శ్రీరాంపూర్ ఓసీ, ఐకేఓసీకి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని చెప్పారు. మందమర్రి సమీపంలోని దేవాపూర్ వద్ద నిర్మిస్తున్న రైల్వే సైడిరగ్ పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ నుంచి ఏప్రిల్ నెల నుంచి బొగ్గు ఉత్పత్తి జరగాలనీ, దీనికి పూర్తి స్థాయి సన్నాహాలు చేపట్టాలన్నారు. అడ్రియాల గని నుంచి ఇకపై రోజుకు 8 వేల టన్నుల ఉత్పత్తి రావాలన్నారు. సమావేశంలో హైదరాబాద్ కార్యాలయం నుంచి సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరామ్, డి.సత్యనారాయణరావు, అడ్వయిజర్(మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, ఈడీ (కోల్ మూమెంట్) జె. ఆల్విన్, జీఎం(మార్కెటింగ్, సీడీఎన్) కె.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.