Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ పేదలకు పని కల్పనకు నిధులు కేటాయించాలి : సీఆర్డీ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ ఉపాధిహామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందనీ, పేదలకు బువ్వ పెడుతున్న ఆ పథకాన్ని క్రమంగా బలహీనం చేసే కుట్రకు పాల్పడుతున్నదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు ఆరోపించారు. హైదరాబాద్‌లోని గ్రామీణ ఉపాధి కల్పన శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బుధవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్లో ఉపాధికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు పని కల్పన కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలనీ, సమ్మర్ అలవెన్సును రద్దు చేస్తూ ఇచ్చిన సర్క్యులర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పనిదినాలను 200రోజులకు, రోజు వేతనాన్ని రూ.600లకు పెంచాలనే డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంపై వత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ నేపథ్యంలో పట్టణాల నుంచి గ్రామాలకు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల వలసలు పెరుగుతున్నాయని తెలిపారు. పెరుగుతున్న కూలీలందరికీ పనులు కల్పించాలంటే బడ్జెట్లో కనీసం రూ. 2.64 లక్షల కోట్లు కేటాయించాలని సంఘాలు కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తుచేశారు. గతేడాది రూ. 98 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో రూ. 73వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని విమర్శించారు. గతేడాది బకాయిలు రూ. 21వేల కోట్లను ఇందులోనుంచే చెల్లించాల్సి ఉందంటూ మంత్రి చెప్పడం చూస్తే ఉపాధి కూలీల పట్ల ప్రభుత్వ చిత్త శుద్ధి అర్థమవుతుందన్నారు. గ్రామీణ పేదలను గాలికి వదిలి, కార్పొరేట్లకు ఎర్రతివాచీలు పరుస్తున్నదని విమర్శించారు. సంఘం అధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ప్రభావంతో రాష్ట్రంలోని కూలీలకు తీవ్ర అన్యాయం జరగనుందని తెలిపారు. కూలీలకు పని దినాలు, కనీస వేతనాలు తగ్గిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లోనుంచి గ్రామాల్లోకి పెరుగుతున్న అసంఘటిత రంగం కార్మికుల వలసలు ఆపడానికి నగర పంచాయతీలు, పట్టణాలు, మున్సిపల్, నగర కార్పొరేషన్లలో పనులకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని అడిగినా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.పద్మ, రాష్ట్ర కార్యదర్శి కె.జగన్, నాయకులు ఆర్ ఆంజనేయులు,రామచందర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.