Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్లో పేదలకు పనికొచ్చేది ఒక్కటీ లేదు
- మత కలహాలు, విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ లక్ష్యం
- కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి పథంలో రాష్ట్రం
- పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
- మేడ్చల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-బోడుప్పల్/జవహర్నగర్
'దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగోది. అలాంటిది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపారు. అసలు నరేంద్ర మోడీ భారత్కు ప్రధానియా లేక గుజరాత్కా..?' అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. జోనల్ వ్యవస్థ ద్వారా 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్రం ఇస్తానన్న15 లక్షల ఉద్యోగాల మాట ఏమైందని ప్రశ్నించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న తెలంగాణలో మత కలహాలు, విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్ కార్పొరేషన్ల పరిధిలో మంత్రి కేటీఆర్ బుధవారం పర్యటించారు. మేడ్చల్ నియోజకవర్గంలో రూ.308 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం నిధులిచ్చినా ఇవ్వకపోయినా సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆపని రాష్ట్రం తెలంగాణ అని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా చాకచక్యంగా చక్కదిద్దిన నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. బోడుప్పల్, పీర్జాదిగూడలో రూ.110 కోట్లతో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎస్ఎన్డీపీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు వివరించారు. మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకరించకపోయినా, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆపబోమని స్పష్టం చేశారు. మంత్రి మల్లారెడ్డి విజ్ఞప్తి మేరకు శివారు కార్పొరేషన్ల పేదల కోసం సర్కారు భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారికి 58, 59 జీవో కింద పట్టాలిస్తామని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలో కొత్తగా 50 వేల మంచినీటి కనెక్షన్లు ఇస్తామని, తాగునీటి కోసం రూ.240 కోట్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. వెజ్, నాన్వెజ్ మార్కెట్ల కోసం రూ.15 కోట్లు కేటాయించినట్టు వెల్లడిరచారు. కరోనా కాలంలో పారిశుధ్య సిబ్బంది, పోలీసులు ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్ రెడ్డి, కుర్మయ్యగారి నవీన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ సాయిచందు, హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మెన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్, మేడ్చల్ కలెక్టర్ ఎస్.హరీష్, జంట కార్పొరేషన్ల కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.