Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు పీఏసీఎస్, ఐకేపీ సెంటర్లలో భారీ అవకతవకలు
- రూ. 2.26 కోట్ల కుంభకోణంలో దేవేందర్‌రెడ్డిపై అనర్హత వేటు
- కోనాపూర్ పీఏసీఎస్ లో 15 ఏండ్లుగా చైర్మెన్‌గా ఎమ్మెల్యే పద్మ భర్త
- చేర్యాల పీఏసీఎస్, కొమురవెల్లి, మద్దూరు ఐకేపీల్లో రూ.5 కోట్ల అవినీతి
- బాధ్యులపై చర్యలతో సరి.. రికవరీ చేసేదెట్లా..
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి/రామాయంపేట
రైతుల సంక్షేమం, ఆర్థిక చేయూత కోసం గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇందులో కొన్ని పీఏసీఎస్, ఐకేపీ సెంటర్లు అవినీతికి అడ్డాలుగా మారడం గమనార్హం. ఏండ్ల తరబడి గుట్టుగా నిధుల మళ్లింపు, తమ అవసరాలకు సంఘం నిధులు వాడుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. సంఘాల నిర్వహణపై నిరంతర నిఘా కొరవడటం, పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల ఆర్థిక లావాదేవీల్లో ప్రజాప్రతినిధుల చొరవతో రైతులకు సంక్షేమ కోసం ఉపయోగించుకోవాల్సిన నిధులన్నీ పక్కదారిపడుతున్నట్టు ఆరోపణలున్నాయి. లక్షల్లో అవినీతి కోట్లకు పడగలెత్తడంతో కొంతమంది డైరెక్టర్ల ద్వారా కుంభకోణానికి సంబంధించిన విషయాలు బయటకు పొక్కుతున్నాయి. ఇంత జరిగినా విచారణ పేరుతో ఉన్నతాధికారులు కాలయాపన చేస్తుండటం ఓ ఎత్తయితే.. చర్యలపేరుతో సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం రెండో ఎత్తు. ఫలితంగా పక్కదారిపట్టిన కోట్లాది రూపాయల సొమ్ము రికవరీ కావడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏండ్ల తరబడిసాగుతున్న ఈతంతును పట్టించుకున్నవారే కరువయ్యారు.
రూ. 2.26 కోట్ల కుంభకోణంలో దేవేందర్ రెడ్డిపై అనర్హత వేటు
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ పీఏసీఎస్ చైర్మెన్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డి దాదాపు 20 ఏండ్లకుపైగా కొనసాగారు. 2005 నుంచి ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు కోనాపూర్ పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికైన దేవేందర్ రెడ్డి.. టిఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత సీఈఓ గోపాల్ రెడ్డి తో కలిసి 2015 నుండి 2020 వరకు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలిసింది. నిధుల దుర్వినియోగంపై ప్రస్తుత పాలక వర్గం జిల్లా సహకార సంఘానికి ఫిర్యాదు చేయగా దేవేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డిలు రూ 2.26 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. దేవేందర్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే పద్మ భర్త కావడం వల్లే రాజకీయ ఒత్తిళ్లతో జాప్యం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాలకవర్గ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని హై కోర్టు ఆదేశించడంతో దేవేందర్ రెడ్డిపై అధికారులు అనర్హత వేటు వేశారు . హైకోర్టు జోక్యం తో కోనాపూర్ పిఎసిఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి పై అనర్హత వేటు వేసినా.. దుర్వినియోగ మైన రూ. 2.26 కోట్ల నిధుల మాటేమిటని పాలకవర్గ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ చైర్మన్ దేవేందర్ రెడ్డి, సీఈవో గోపాల్ రెడ్డి లపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టు జోక్యంతో దేవేందర్ రెడ్డిపై గత నెల 25న అనర్హత వేటు వేసినా, ఈ విషయాన్ని అధికారులు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. చట్టపరంగా చర్యలు తీసుకున్న విషయాన్ని పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు చెప్పాల్సి ఉన్నా, ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం అధికారులకు ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేవేందర్ రెడ్డి అనర్హత వేటుకు గురికావడంతో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోపరేటివ్ లిమిటెడ్ ( ఇఫ్కో ), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ( డిసిసిబి ) డైరెక్టర్ పదవులకు గండం ఏర్పడింది. ఇఫ్కో, డీసీసీబీ డైరెక్టర్ గా కొనసాగాలంటే ఏదో ఒక సహకార సంఘం చైర్మన్ గా కచ్చితంగా ఉండాలి. జిల్లా సహకార సంఘం ఆయనపై కోనాపూర్ పిఎసిఎస్ చైర్మన్ పదవి నుండి అనర్హత వేటు వేయడంతో, ఇఫ్కో, డీసీసీబీ డైరెక్టర్ పదవు లకు వేటు పడే అవకాశం ఉంది.
డీసీసీబీ చైర్మెన్ సొంత ఇలాకాలోనూ..?
సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో లక్షలాది రూపాయలు నిధులు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జాతీయ స్థాయి ఉత్తమ డీసీసీబీ చైర్మెన్ అవార్డు అందుకున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మెన్ చిట్టి దేవేందర్ రెడ్డి సొంత సహకార సంఘం లో నిధులు గోల్మాల్ జరిగినట్లు పలువురు డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు.
కొమరవెల్లి,దూల్మిట్ట మండలాల్లోని ఐకేపీల్లోనూ..
సిద్దిపేట జిల్లా కొమరవెల్లి, దూల్మిట్ట మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ట్రక్ షీట్ల కుంభకోణం జరిగి సంవత్సరం దాటినా కేసులు ఇంకా విచారణ స్థాయిలోనే ఉన్నాయి. కొమరవెల్లి మండలంలో మరిముస్త్యాల, దూల్మిట్ట మండలంలోని బైరాన్‌పల్లి గ్రామంలో గత యాసంగి పంట కొనుగోళ్ల సమయంలో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. కొమరవెల్లి మండలంలో రూ.3 కోట్లకు పైగా ట్రక్ షీట్ల అవినీతి జరగింది. బైరాన్‌పల్లి ఒక్క ఐకేపీ సెంటర్ లో ఏకంగా రూ.32 లక్షల అక్రమాలు చోటుచేసుకున్నట్టు విచారణలో తేలింది. దీంతో నాటి అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్, సీఏ,సీసీ లను విధుల నుంచి తొలగించారు. వారి స్థానాల్లో కొత్తవారిని నియమించడం గానీ.. ఇంచార్జి బాధ్యతలు ఇతరులకు గానీ చేయలేదు. ఒకరికి ఇంచార్జ్ ఏపీఎంగా బాధ్యతలివ్వగా.. కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులుగా ఉండే సీఏ, సీసీలుగా ఎవర్నీ నియమించలేదు. దీంతో వానాకాలం పంటల కొనుగోలు సమయంలో రైతులకు అనేక ఇబ్బందులు ఎదరయ్యాయి. చివరకు రేబర్తి పీఏసీఎస్ ద్వారా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించారు.