Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు ఉత్తర్వులు
- టాలీవుడ్ డ్రగ్స్‌పై పిల్ మూసివేత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టాలీవుడ్‌తో సంబంధం ఉన్న మాదకద్రవ్యాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తునకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. యువత పెడమార్గం పట్టేందుకు ప్రధాన కారణాల్లో మాదకద్రవ్యాలు ఒకటనీ, దీనిని అడ్డుకోవడం ద్వారా దేశ భవిష్యత్‌ను కాపాడుకోవాలని చెప్పింది. ఈడీ సమాచారం అడిగితే ఇవ్వకపోతే ఎలాగని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమాచారాన్ని ఈడీకి ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈడీ అప్లికేషన్ చేసుకున్న 15 రోజుల్లోగా స్పందించాలనీ, రాష్ట్రం వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. డ్రగ్స్ కేసులో కాల్ డేటా రికార్డులను నెల రోజుల్లో ఈడీకి ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఉత్తర్వులిచ్చింది. టాలీవుడ్‌తో సంబంధాలు ఉన్న డ్రగ్స్ కేసు దర్యాప్తు మందకొడిగా సాగుతున్నందున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ పి.రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను బుధవారం బెంచ్ విచారించింది. ఈడీ దర్యాప్తు సరిపోతుందనీ, సీబీఐ ఇతర దర్యాప్తు సంస్థలకు కేసు ఇవ్వక్కర్లేదని పేర్కొంది. ఎక్సైజ్ అధికారులు సమాచారం ఇవ్వకపోతే ఈడీ హైకోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పింది. ఆన్లైన్లో విచారణకు ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సమాచారం, డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. లాయర్ రచనారెడ్డి వాదిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడం లేదనీ, సినీరంగానికి చెందిన కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నందున సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈడీ అడిగిన వివరాలన్నీ ఇచ్చామని, ఇతర డాక్యుమెంట్లు, ఎఫ్ఐఆర్లు ఈడీ, కోర్టులకు ఇచ్చామని ప్రభుత్వం న్యాయస్థానానికి చెప్పింది. ఈ క్రమంలో. ఈడీ దర్యాప్తు అధికారులు కోరిన రికార్డులన్నీ ఇవ్వాలనీ, తమ ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు సూచించింది. ఒకవేళ ప్రభుత్వం వివరాలు ఇవ్వకపోతే ఈడీ హైకోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పింది. అనంతరం కేసు విచారణను ముగించింది.