Authorization
Sat April 05, 2025 04:07:26 pm
- రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆగ్రహం
నవతెలంగాణ- విలేకరులు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. రాష్ట్రానికి అన్యాయం చేశారని, జిల్లాల్లో పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. వేతన జీవులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గద్వాల-మాచర్ల రైల్వే లైన్లకు నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించకపోవడం దురదృష్టకరమని, అందుకు కేసీఆర్ అసమర్థతే కారణమని విమర్శించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి.వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేశారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నస్పూర్‌లో కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేశారు. శ్రీరాంపూర్‌లో ఏరియా వైస్ ప్రెసిడెంట్ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని గనులు, డిపార్ట్మెంట్ల వద్ద నిరసన తెలిపారు. ఖమ్మంలో టీఆర్ఎస్ యువజన విభాగం, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రులు దహనం చేశారు. ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో గట్ట సెంటర్లో మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మంచికంటి భవన్ ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు. సీపీఐ నాయకులు మోకాళ్ల కూర్చొని నిరసన తెలిపారు. ఇల్లందులో సీపీఐ(ఎంఎల్) పార్టీ నాయకులు మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. అశ్వారావుపేటలో సీఐటీయూ నాయకులు బడ్జెట్ కాపీలను దహనం చేశారు.
కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చెవిలో పువ్వు, చేతిలో చిప్పతో నిరసన చేపట్టారు. కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద డీవైఎఫ్ఐ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో నల్ల గుడ్డలతో నిరసన తెలిపారు. హుజూరాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ(ఎం) నాయకులు కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. టెక్స్టైల్ పార్క్ గేట్ ఎదుట నిరసన తెలిపారు. బడ్జెట్ స్థూలంగా ప్రజాసంక్షేమాన్ని ఫణంగా పెట్టి, తెలంగాణకు ద్రోహం చేసిందని, సంక్షేమ, విద్యా వ్యతిరేక బడ్జెట్ అని సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా నాయకులు చింతల యాదయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పడాల శంకర్ అన్నారు. ఘట్కేసర్ మండల కేంద్రంలో సీపీఐ(ఎం), ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వేర్వేరుగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు.