Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ దిశగా బడ్జెట్లో కేటాయింపుల్లేని వైనం
- నిటి అయోగ్ సూచనలను సైతం పట్టించుకోని ఆర్థిక మంత్రి
- రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన బీజేపీ సర్కారు
గుడిగ రఘు
'భూమినే నమ్ముకున్న అన్నదాతలు కష్టాల్లో ఉన్నారు. వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తేగానీ సాగుబండి నడిచే పరిస్థితి లేదు. పంట చేతికొచ్చినప్పుడు రైతు ఎంత ఆనందపడుతాడో, దాన్ని అమ్మితే అప్పులు తీరి, అవసరాలకు తగిన ఆదాయం మిగిలితే రైతుకుండే ఆ సంతోషమే వేరు' అంటూ ప్రధాని నరేంద్రమోడీ 2016 ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పారు. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించలేదు. అందుకనుగుణంగా కేటాయింపులు ప్రస్తుత బడ్జెట్లో చేయలేదు. గతేడాది సర్కారు వడ్డీ మాఫీ కోసం రూ 18,142 కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్లో రూ 19,500 చూపించింది. రుణమాఫీ కోసం రూ 1,300 కేటాయించినట్టు కనిపించినప్పటికీ అది వడ్డీ రాయితీకి కూడా సరిపోదు. పంటల బీమాకు గతేడాది ఖర్చు మాత్రం రూ 15,989 కేటాయించినా, రూ 15,500 కోట్లకే పరిమితమైంది. రూ 489 కోట్లు మిగుల్చుకుంది. కిసాన్ సమ్మాన్ నిధి కోసం స్వల్పంగా పెంచింది. ఆహార భద్రత విషయంలో రూ 500 కోట్లు తగ్గించి రైతుల ఆదాయానికి గండికొట్టింది. ఉద్యావన పంటలకు, వర్షాభావ ప్రాంతాలపై కేంద్ర శీతకన్నేసింది. దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్నదనీ, సాగుకయ్యే ఖర్చు, కుటుంబ శ్రమను కలుపుకుని కనీస మద్దతు ధర నిర్ణయించాలనే స్వామినాథన్ కమిటీ సిఫారులను బీజేపీ సర్కారు విస్మరించింది. దాని ప్రతి నిర్ణయం వెనుక కార్పొరేట్ల ప్రయోజనాలు దాగి ఉన్నాయంటూ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా రైతు సంక్షేమానికి కోతలు పెడుతూ...మరోవైపు ఆదాయం రెట్టింపు చేయడం ఎలా సాధ్యమని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
లక్ష్యం రూ 21,146...వస్తున్నది రూ 12952
కేంద్ర ప్రభుత్వం రైతు ఆదాయాన్ని రెట్టింపు ( ఫార్మర్ ఇన్కం డబుల్) చేయడంలో భాగంగా రూ 21,146 లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ప్రస్తుతం ఒక్కొ రైతు కుటుంబానికి వస్తున్న ఆదా యం మాత్రం రూ 12,952 నమోదవుతున్నది. 2012-13లో ఈ ఆదాయం రూ 6,496 ఉండగా, 2015-16లో 8,059గా లెక్కలేసింది. 2018-19లో అది పదివేలుగా
నమోదైంది. ఈ లెక్క ప్రకారం ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతుకు మిగులుతున్నది అంతంతేనని విధితమవుతున్నది. నిటి అయోగ్ అధ్యయనం ప్రకారం వ్యవసాయేతర కార్మికుడి ఆదాయం 34 శాతంగా ఉంది. దీంతో కార్మికుడి, కర్షకుడి ఆదాయంలో చాలా తీవ్రమైన వ్యత్యాసం కొనసాగుతున్నది. సాగు ఖర్చులు భారమవుతున్నాయి.
రైతుకు సవాళ్లేన్నో
సాగు కోసం రైతు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. వాటికి పరిష్కారం చూపించకుండా రైతుకు రెట్టింపు ఆదాయమనేది కలే. దేశంలో ఉదారవాద విధానాలు ప్రవేశించిన తర్వాత వాటి ప్రభావం వల్ల రైతు ఆత్మహత్యలు పెరిగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక దాదాపు ఎనిమితి లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మన రాష్ట్రంలో దాదాపు నాలుగు వేల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటున్నాయి. వాటికి పరిహారం అందనిద్రాక్షగా మారింది. సాగుబడి కోసం తెచ్చిన అప్పులు తీరక, విధిలేని పరిస్థితుల్లో రైతులు కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు. పండిన పంటలకు కనీస మద్దతు ధరలకు గ్యారంటీ కూడా లేదు. ఆ చట్టం చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నది. ఇప్పటికే ఎరువుల ధరలు పెంచిన కేంద్రం...తాజాగా యూరియా సబ్సిడీకి కోత పెట్టింది. ఫలితంగా రైతులపై ధరల భారం పడనుంది. సాగుకు సాంకేతికతను జోడిస్తే తప్ప రైతుకు మేలు జరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ దిశగా కూడా బడ్జెట్లో నిధులులేవు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు. యాంత్రీకరణ, సబ్సిడీలు...ఇలా అన్ని విధాలుగా ప్రోత్సహించడం ద్వారా రైతుకు ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
'సహకార'ం నిర్వీర్యం
బీజేపీ సర్కారు వ్యవసాయ సహకార సంఘాలను నిర్వీర్యం చేస్తున్నది. వాటి స్థానంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్పీవో)లను ప్రోత్సహిస్తున్నది. దీని ఫలితంగా రైతులకు సహకారం ఉండదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో 908 వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వాటికి సహాయనిరాకరణ చేయడంతో అవి అప్పుల్లో కూరుకుపోయాయి. ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా సహకార సంఘాలకు కేంద్రం రూ.3వేల కోట్లు కేటాయించింది. ఒక్కొక్క సంఘానికి రెండు కోట్ల చొప్పున ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఇప్పటికీ ఆ నిధులు చేరలేదు. సాగుపనులకు అవసరమయ్యే ఆధునిక యంత్రాలను కొని రైతులకు తక్కువ ధరకు అద్దెకు ఇవ్వాలని కేంద్రం సూచించింది. నిధులు లేకపోవడంతో అద్దె యంత్రాలు ఎక్కడా అందుబాటులోకి రావడం లేదు. ఇలా అనేక విధాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ కేంద్ర సర్కారు ఉత్తుత్తి మాటలుచెతున్నదని వ్యవసాయ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.