Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీలో కొత్త నిబంధనలు
- లాంగ్రూట్లలో ఇద్దరు డ్రైవర్లకు ఇదే గీటురాయి
- బస్సుల్లోనే నిద్ర.. టిక్కెట్ల బాధ్యత కూడా
- ఈ రూట్లకూ లింక్ సర్వీసులు
- లబోదిబోమంటున్న కార్మికులు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌లో కొత్త నిబంధనలు కార్మికులకు ఊపిరిసలపనీయడం లేదు. చట్టం ప్రకారం పని గంటలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. కిలోమీటర్లను బట్టి లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కారా లేదా అన్నది కాకుండా టార్గెట్ ఇచ్చిన ప్రకారం కిలోమీటర్లు వెళ్లారా లేదా అన్నదే ఇప్పుడు పనికి గీటురాయిగా మారింది. ఇక డబుల్ డ్యూటీ(డీడీ) చేస్తే అత్తెసరు చేతిలో పెట్టి సరిపెట్టుకోమంటున్నారు. ఇదేంటి అంటే టార్గెట్ చేసి రాచిరంపాన పెడుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఇదే ట్రెండ్‌గా మారింది. నవతెలంగాణలో సోమవారం ప్రచురితమైన 'శ్రమదోపిడీకి ప్రయోగశాల'పై నిజామాబాద్ రీజియన్ మేనేజర్ సుధాపరిమిళ స్పందించారు. నిజామాబాద్ డిపో-2తో పాటు ఏ డిపోలోనూ కార్మికులు వారానికి 48 గంటల కన్నా ఎక్కువ పని చేయడం లేదని తెలిపారు. ఆర్టీసీలో పని గంటలు అటకెక్కాయి. ఇప్పటికే స్పెషల్ ఆఫ్‌లు, ఓటీలు ఎత్తేసిన వైనాన్ని 'నవతెలంగాణ' వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా పని గంటల బదులుగా కిలోమీటర్ల టార్గెట్ విధిస్తున్నారు. ఒక బస్సుపై ఎంత మంది కార్మికులు ఉంటే అన్ని కిలోమీటర్లు లెక్కగట్టి పనిచేయిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. అటు టిక్కెట్లు ఇవ్వడం, ఇటు బస్సు నడపడం రెండు పనులు చేయిస్తూ డ్రైవర్లను రెస్ట్‌లెస్‌గా మారుస్తున్నారు. ఒకప్పుడు నాలుగు రోజుల మస్టర్ ఉన్న డ్యూటీ ప్రస్తుతం రెండు రోజులకు మార్చారు. అదనంగా 200-240 కిలోమీటర్లు పెంచారు. ఒక్కో బస్సుకు కండక్టర్ స్థానంలో ఇద్దరు డ్రైవర్లను పంపుతూ 900-1000 కిలోమీటర్ల లక్ష్యం విధిస్తున్నారు.
ఉదాహరణకుకు కామారెడ్డి డిపోలోని భద్రాచలం సర్వీసుకు మొదట కండక్టర్, డ్రైవర్‌ను ఇచ్చి నాలుగు రోజుల హాజరు ఇచ్చేవారు. (776 కిలోమీటర్లు) ఆ తరువాత మూడు రోజులకు తగ్గించారు. ప్రస్తుతం దాన్ని రెండు రోజులకు తగ్గించారు. ప్రస్తుతం భద్రాచలం సర్వీసుకు ఇద్దరు టీమ్ డ్రైవర్లను ఇచ్చి ఒక జేబీఎస్ లేదా రెండు నిజామాబాద్ ట్రిప్పులు అదనంగా జత చేశారు. దాదాపు 30 గంటలు పని చేయించి కేవలం రెండు రోజుల హాజరు ఇస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి భద్రాచలం సర్వీసు టైమింగ్
కామారెడ్డి 5.00/30 నిజామాబాద్ 6.40/7.00
కామారెడ్డి 8.10/30 భద్రాచలం 21.00/22.00
రెండో రోజు భద్రాచలం నుంచి
కామారెడ్డి 8.40/9.00 నిజామాబాద్ 10.10/20
కామారెడ్డి 11.30(ఇన్కమింగ్)
ఈ విధంగా సుమారు 1016 కిలోమీటర్లు ఇద్దరు డ్రైవర్లకు రెండు రోజుల పాటు ఒక్కో డ్రైవర్‌తో 2 రోజుల హాజరు ఇస్తూ నష్టం చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఇదే విధంగా వింజమూరు సర్వీసులో సైతం 1400 కిలోమీటర్లు తిప్పుతూ కార్మికులతో 39.30 గంటలు పని చేయిస్తూ మూడు రోజుల హాజరు మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. ఇలానే నిజామాబాద్, ఆర్మూర్ డిపోల నుంచి గుంటూరు, విజయవాడ, భద్రాచలం సర్వీసులకు రెండు రోజుల హాజరు ఇస్తున్నారని, ఇక బోధన్ నుంచి మదనపల్లి, తెనాలి 1400 కిలోమీటర్లు తిప్పి కేవలం మూడు రోజుల హజరు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికులకు టికెట్ ఇవ్వడం, చిల్లర ఇవ్వడం పది నిమిషాలు దాటితే దాన్ని డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలనే నిబంధనను అడ్డుపెట్టుకుని కార్మికుడు స్టీరింగ్‌పై ఉన్న గంటలను పని గంటలను లెక్కించి తప్పుడు లెక్కలు వేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. సరాసరి ఒక కార్మికుడు లాంగ్ సర్వీస్‌కు సైతం 200-250 కిలోమీటర్లు ఒక మస్టర్‌గా లెక్కిస్తున్నారు. ఈ విధంగా ఇద్దరు డ్రైవర్లను లెక్కిస్తూ రెస్టు లేకుండా కిలోమీటర్ల టార్గెట్ ఇచ్చి చివరి పాయింట్లలో ఎలాంటి రెస్టు ఇవ్వకుండా నిద్రించడానికి కూడా సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులోనే ఒక డ్రైవర్ టిక్కెట్లు ఇవ్వాలి, మరో డ్రైవర్ పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అని ఆదేశాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
వారంలో 48 గంటలు కూడా పని చేయట్లే
మోటారు వాహన చట్టం ప్రకారం ఒక్కో ఉద్యోగి రోజుకు 8 గంటల చొప్పున వారానికి 48 గంటలు పని చేయాలి. నిజామాబాద్ డిపో-2లో నిర్మల్, హైదరాబాద్, భైంసా డ్యూటీలకు వరంగల్, భైంసా లింక్ చేస్తూ వారం రోజులలో 4 రోజులు పని చేసేలా 48 గంటలు కన్నా తక్కువ పని గంటలు వచ్చే విధంగా డ్యూటీలు రూపొందించాం. డ్యూటీ చార్ట్ ప్రకారం ఒక్కో ఉద్యోగికి ఒక వారంలో అత్యధికంగా 43.30 గంటలు అత్యల్పంగా 33.35 గంటలు ఉన్నవి.
- ఆర్ఎం. సుధాపరిమిళ