Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యలపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇవ్వాలనీ, తద్వారా గందరగోళాన్ని తొలగించాలని కోరారు. మతోన్మాద ధోరణులను, నియంతృత్వ విధానాలను విమర్శిస్తూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఏ విషయాలు, అంశాల్లో మార్చాలనే దానిపై నిర్దిష్టంగా వివరణివ్వాలని సూచించారు. అప్పుడు ఈ గందరగోళానికి అవకాశముండబోదని తెలిపారు. నిజానికి రాజ్యాంగ
విలువలను తుంగలో తొక్కుతున్నది కేంద్రంలో మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్సేనని విమర్శించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలైన ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ, లౌకిక విలువల మీదనే మోడీ ప్రభుత్వం దాడి చేస్తున్నదని పేర్కొన్నారు. అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగ సభ రూపొందించిన రాజ్యాంగంలో ఈ విలువలు స్వాతంత్య్రోద్యమ వారసత్వంగా వచ్చాయని గుర్తు చేశారు. జాతీయోద్యమంతో ఏ మాత్రం సంబంధం లేని ఈ మతోన్మాద శక్తులు, అంబేద్కర్ పేరును వాడుకుంటూ, రాజ్యాంగ విలువలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. అలాంటి బీజేపీ నేతలు, ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలను ఎదురుదాడికి వాడుకుంటున్నారని తెలిపారు. దీనిపై కొందరు సామాజిక సంస్థల నాయకులలోనూ గందరగోళం వ్యక్తమవుతున్నదని పేర్కొన్నారు.