Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పంచాయతీరాజ్ శాఖలో పునర్వ్యవస్థీకరణ పేరుతో ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు, కారోబార్, బిల్ కలెక్టర్, ఇతర సిబ్బందికి అన్యాయం చేయొద్దని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం ఆ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.గణపతిరెడ్డి, చాగంటి వెంకటయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ జనాభా ప్రాతిపదికన ఊర్లను ఏ ప్లస్, ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించనుందని తెలిపారు. ఆయా పంచాయతీల్లో విధులు నిర్వహించేందుకు గానూ కేటగిరీల వారీగా ఉద్యోగుల నియమించబోతున్నదని పేర్కొన్నారు. బీ, సీ గ్రేడ్లలో ఉన్న 11,429 గ్రామ పంచాయతీలకు జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లను కేటాయించలేదని తెలిపారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. పంచాయతీల్లో జీఓఎంఎస్ నెం.51 ప్రకారం జనాభా ప్రతిపదికపై 500 మందికి ఒక కార్మికున్ని నియమించాలనే నిబంధనను గుర్తుచేశారు. అయితే, జనాభా ప్రాతిపదికను 2022 లెక్కల ప్రకారం కాకుండా 2011 లెక్కల ఆధారంగా నియమించాలని ప్రతిపాదించడం అన్యాయమని తెలిపారు. సుదీర్ఘకాలంగా ఉద్యోగ, కార్మిక సంఘాలు అర్హులైన కారోబార్, బిల్ కలెక్టర్లను ఖాళీ పోస్టులలో ప్రత్యేక హోదా కల్పించి నియమించాలనీ, 500 మందికి ఒక కార్మికుడ్ని 2011 జనాభా ప్రాతిపదికపై కాకుండా 2022లో గ్రామాల్లో నివసిస్తున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అవసర ప్రాతిపదికపై కార్మికుల్ని నియమించాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. గ్రామ పంచాయతీ సిబ్బందిలో విద్యార్హత కల్గిన వారికి అర్హతను బట్టి ఖాళీ పోస్టులలో అవకాశం కల్పించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పెదచెవిన పెట్టిందని విమర్శించారు. ఏండ్ల తరబడి పనిచేస్తున్న కారోబార్, బిల్ కలెక్టర్లను జూనియర్ అసిస్టెంట్లుగా, బిల్ కలెక్టర్లుగా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరారు.