Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవసరమైన ఉత్తర్వులు జారీ చేయండి : సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొత్త జిల్లా క్యాడర్‌కు ఉపాధ్యాయుల కేటాయింపు వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు గురువారం ఆయన లేఖ రాశారు. వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా సమస్యలు మరింత జఠిలంగా మారుతున్నాయని తెలిపారు. సానుకూలంగా ప్రయత్నిస్తే సమస్యలు సరళంగా మారి అత్యధికం పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. పాత క్యాడర్లలో ఉన్న ఉద్యోగులను కొత్త క్యాడర్లకు కేటాయించడం వల్ల స్థానికత కోల్పోయామనే భావన ఏర్పడిందని వివరించారు. పరస్పర బదిలీల ద్వారా స్థానికత సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం బుధవారం 21 జీవోను విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇది సమస్య పరిష్కారానికి ఉపయోగపడేటట్టు లేదని తెలిపారు. 317 జీవోకు అనుబంధంగా మార్గదర్శకాలు జారీ చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని వివరించారు. సర్వీసు కోల్పోయే సమస్య ఏర్పడదని సూచించారు. క్యాడర్ మార్పిడి కోసం ప్రభుత్వమే దరఖాస్తులు స్వీకరించి, అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించొచ్చని కోరారు. సీనియార్టీ జాబితాలో జరిగిన తప్పులపై అప్పీళ్లు పరిష్కరించాలని కోరారు. వివిధ శాఖలు, జీఏడీ కలిసి ఆ అప్పీళ్లను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయని విమర్శించారు. అత్యధిక అప్పీళ్లు ఉపాధ్యాయులవే ఉన్నాయనీ, వాటిని పరిష్కరిస్తే కొంత ఉపశమనం కలుగుతుందని సూచించారు. భార్యాభర్తలకు సంబంధించిన సమస్యలు ఉపాధ్యాయులవే ఎక్కువున్నాయని తెలిపారు. 13 జిల్లాలకు భార్యాభర్తల బదిలీలను నిలిపివేయడం వల్ల 2,572 మంది ఉపాధ్యాయులు ఈ సమస్యతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలను వేర్వేరుగా పరిశీలిస్తే ఎక్కువ మందికి ఉపశమనం కలుగుతుందని వివరించారు. ఒంటరి మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భర్త అకాల మరణం, విడాకుల వల్ల ఒంటరైన మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. గతంలో వారికి బదిలీల్లో ప్రాధాన్యత ఉండేదని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించాలనీ, అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.