Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి : లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనీ, దానివల్లనే తాను సీఎం అయ్యాననే విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా భీం దీక్షలను చేపట్టారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన దీక్షలో లక్ష్మణ్‌తోపాటు బీజేపీఎల్పీ నేత రాజాసింగ్, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, తుల ఉమ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాజ్యాంగం పట్ల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశాన్నే దిగ్భాంత్రికి గురిచేసిందన్నారు. అంబేద్కర్ 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు రెండేండ్లకుపైగా కష్టపడ్డారని తెలిపారు. ఆ రాజ్యాంగంలో దేశంలోని అసమానతలను పారదోలి సమానతను పాదుగొల్పేందుకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనీ, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.