Authorization
Sat April 05, 2025 10:32:03 am
- ప్రజాప్రతినిధుల్లారా మద్దతు తెలపండి
- సింగరేణి పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మెన్లకు జేఏసీ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించినా యాజమాన్యం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 12 నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెకు కోల్ బెల్ట్ ఏరియాలోని ప్రజాప్రతినిధులంతా పార్టీలకతీతంగా మద్దతు తెలపాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది. ఈ మేరకు గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్ద జెడ్పీ చైర్పర్సన్ పుట్టమధు, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలకు జేఏసీ బహరంగలేఖను రాసింది. ఆ లేఖను మీడియాకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల యూనియన్ల నేతలు జి.సత్యనారా యణ(ఏఐటీయూసీ అనుబంధ సంఘం ప్రధాన కార్యదర్శి), బి.మధు(సీఐటీయూ అనుబంధ సంఘం ప్రధాన కార్యదర్శి), ఎ.వెంకన్న(ఐఎఫ్టీయూ అనుబంధ సంఘం అధ్యక్షులు), ఎమ్డీ రాసుద్దీన్(ఐఎఫ్టీయూ అనుబంధ సంఘం ప్రధాన కార్యదర్శి), కె.నాగభూషణం(ఐఎన్టీయూసీ అనుబంధ విభాగం ప్రధాన కార్యదర్శి), బీవీ రమణారావు(హెచ్ఎమ్ఎస్ అనుబంధ సంఘం ఉపాధ్యక్షులు), టీసీకేఎస్ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ విడుదల చేశారు. సింగరేణిని రక్షించుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ పిలుపును జేఏసీ నేతలు స్వాగతించారు. బొగ్గుగనుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కాంట్రాక్టు కార్మికులంతా ముందు వరుసలో ఉంటారని ప్రకటించారు. గతంలో జరిగిన అన్ని పోరాటాల్లోనూ పాలుపంచుకున్న విషయాన్ని ప్రస్తావించారు. సింగరేణి లాభాలను గడించడంలో ప్రధానపాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలనీ, సమస్యలను పరిష్కరించాలని తాము చేస్తున్న పోరాటానికి అండగా నిలబడాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచడంలో, చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. కోల్ ఇండియా స్థాయిలో జరిగిన ఒప్పందాల అమలులోనూ వివక్ష పాటిస్తున్నదని వాపోయారు. రామగుండం బ్లాస్టింగ్ ప్రమాదంలో చనిపోయిన నలుగురు కాంట్రాక్టు కార్మికులకు 40 లక్షల రూపాయలు చెల్లిస్తామంటూ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మెన్ సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని కూడా యాజమాన్యం అమలు చేయలేదని విమర్శించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు పెంచిన 30 శాతం వేతనాల పెంపు సింగరేణిలో అమలు కావట్లేదని తెలిపారు. ఎన్ని వినతిపత్రాలిచ్చినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతోనే సమ్మెలోకి వెళ్తున్నామని తెలిపారు.