Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఇంటర్ లోకల్ క్యాడర్ (అంతర్జిల్లా) పరస్పర బదిలీలకు అనుమతిస్తూ జారీ చేసిన 21 జీవోను సవరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూటీఎస్్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి సదానందంగౌడ్, ఎం పర్వత్‌రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరస్పర బదిలీల్లో ఒక్కరైనా పీవో-2018 ప్రకారం బదిలీ అయి ఉండాలని నిబంధన విధించడం సరైంది కాదని తెలిపారు. వేర్వేరు పూర్వ జిల్లాల్లో నియామకమైన ఉపాధ్యాయులు వారి కుటుంబ అవసరాల కోసం పరస్పర బదిలీల ద్వారా ఇతర జిల్లాలకు వెళ్లేందుకు 2012 నుంచి అంతర్ జిల్లా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈ నిబంధన కారణంగా వారికి పరస్పర బదిలీకి అవకాశం దక్కకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బదిలీ కోరుకుంటే సీనియార్టీలో చివరి ర్యాంకు తీసుకోవాలని నిబంధన విధించడం సరైంది కాదని తెలిపారు. ఒకే పూర్వపు యూనిట్లో నియామకమై అదే పూర్వపు యూనిట్ పరిధిలోని నూతన యూనిట్‌కు బదిలీ అయిన వారికి సీనియార్టీ మొత్తం లెక్కించాలని సూచించారు.
షరతుల్లేని పరస్పర బదిలీలు చేపట్టాలి : పీఆర్టీయూ తెలంగాణ
317 జీవో ద్వారా ఏర్పడ్డ అవకతవకలను, ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించి న్యాయం చేయాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి తెలిపారు. షరత్తుల్లేకుండా పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. స్థానికత కోల్పోయిన వారికి మానవీయ కోణంలో ఆలోచించి న్యాయం చేయాలని సూచించారు. 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోతే, 21 జీవో ద్వారా సీనియార్టీని కోల్పోవాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కంటితుడుపు చర్యగా విడుదల చేసిన 21 జీవోను సవరించాలనీ, సీనియార్టీ కోల్పోకుండా శాస్త్రీయ పద్ధతిలో పరస్పర బదిలీలను చేపట్టాలని సూచించారు.
ఉపాధ్యాయులకు ప్రయోజనం లేదు : టీఎస్‌టీటీఎఫ్
ఉపాధ్యాయులకు ప్రయోజనం లేని పరస్పర బదిలీల జీవో 21ని వెంటనే సవరించాలని టీఎస్‌టీటీఎఫ్ అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్ డిమాండ్ చేశారు. 317 జీవో వల్ల ఉపాధ్యాయుల సర్దుబాటులో జరిగిన అన్యాయాన్ని కనీసం పరస్పర బదిలీల ద్వారా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. 21 జీవో వల్ల సీనియార్టీని కోల్పోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. అది కోల్పోకుండా శాస్త్రీయ పద్ధతిలో మానవీయ కోణంలో ఆలోచించి ఆ జీవోను సవరించాలని కోరారు. సీనియార్టీని కోల్పోకుండా పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని సూచించారు.