Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల ఐదో తేదీ నుంచి 7 వరకు నిర్వహణ : సన్నాహక కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల ఐదు నుంచి ఏడో తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఆ యూనియన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ బీవీ విజయలక్ష్మి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాలరాజు, వీఎస్బోస్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్డీ యూసుఫ్ ప్రకటించారు. గురువారం హైదరాబాద్లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాచిగూడలోని మహారాజ క్లాసిక్ ఇన్ హోటల్లో జరుగుతాయని చెప్పారు. 25 రాష్ట్రాల నుంచి దాదాపు 350 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఐదో తేదీన ఉదయం పది గంటలకు జనరల్ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయనీ, ఆరో తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. జాతీయ, ఆయా రంగాల అగ్రనాయకులు పాల్గొంటారని చెప్పారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులపై జరుగుతున్న దాడి, నిరుద్యోగం, సామాజిక భద్రత, ఉపాధి కల్పన అంశాలు, అంగన్వాడీ నిధులు కేటాయింపుల అన్యాయం, కేంద్ర బడ్జెట్లోకార్మిక సంక్షేమానికి నిధులు కేటాయించకపోవటం, దేశ సంపదను పెట్టుబడిదారులకు, సంపన్నులకు, ఆదానీ, అంబానీలకు దోచిపెడుతున్న చర్యలపై కూలంకుశంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేస్తామని తెలిపారు. సన్నాహక సమావేశంలో ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు బి.చంద్రయ్య, కార్యదర్శులు యం.నర్సింహ్మ, బి.వెంకటేశం, కోశాధికారి పి.ప్రేంపావని, రాష్ట్ర నాయకులు మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.