Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ ఆవేదనతోనే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు : తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అణగారిన వర్గాలకు న్యాయం జరగడం లేదనే ఆవేదనతోనే కేసీఆర్, అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కొత్త రాజ్యాంగం అవసరమని వ్యాఖ్యానించారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమర్థించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మాట్లాడకుండా కాంగ్రెస్, బీజేపీలు కొత్త రాజ్యాంగ ప్రతిపాదనపై మాట్లాడుతూ చర్చను పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నాయని విమర్శించారు. బడ్జెట్లో తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ను అవమానించిన అరుణ్ శౌరిని కేంద్ర మంత్రి చేసిన బీజేపీ వాజ్ పేరు హయాంలో రాజ్యాంగాన్ని సమీక్షించేందుకు కమిషన్ వేయలేదా అని ప్రశ్నించారు. గాడ్సే వారసులు బీజేపీ నాయకులకు ప్రచార యావతో కుక్కల్లా మొరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అంబేద్కర్ స్ఫూర్తితో పని చేస్తున్న పార్టీ అని తెలిపారు. అవసరమైతే రాజ్యాంగానికి మార్పులు, చేర్పులు చేయాలని అంబేద్కరే ప్రతిపాదించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని సవరించలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమవీరుడంటూ ఆయన ట్యూషన్ చెప్పే అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ సముద్రంలోకి నీళ్లు వృధాగా పోతున్నాయనీ, లక్షల ఎకరాలు సాగుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. .సాగు నీరు, కరెంటు సమస్యలు త్వరిత గతిన పరిష్కారించాలంటే రాజ్యాంగం మార్పు కావాలని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మేలైన పాలన అందేందుకు రాజ్యాంగ మార్పు చర్చను కేసీఆర్ ముందుకు తెచ్చారనీ, రాజ్యాంగ మార్పుపై లోతైన చర్చ జరగాలనేది కేసీఆర్ అభిప్రాయమని తలసాని వెల్లడించారు. సమావేశంలో హైదరాబాద్ నగరానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్ ,ముఠా గోపాల్ పాల్గొన్నారు.
దళితులకు న్యాయం జరగకే...
కొత్త రాజ్యాంగం చర్చ : గువ్వల బాలరాజు
కాంగ్రెస్, బీజేపీలు సుదీర్ఘకాలం పాలించిన దేశంలో దళితులకు న్యాయం జరగనుందునే కేసీఆర్ కొత్త రాజ్యాంగం చర్చను లేవనెత్తారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు. ఆ పార్టీలకు దమ్ముంటే కేసీఆర్ ప్రతిపాదనపై పార్లమెంటులో చర్చించాలని సవాల్ చేశారు. రాజ్యాంగంలో గట్టి చట్టాలు ఉంటేనే దేశంలో అనుకున్న మార్పు సాధ్యమని కేసీఆర్ గట్టిగా నమ్ముతారని తెలిపారు. ...ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. పీయూసీ చైర్మెన్ ఏ.జీవన్ రెడ్డి మాట్లాడుతూ .రాజ్యాంగాన్ని 105 సార్లు మార్చుకున్నపుడు కొత్త రాజ్యాంగం తెస్తే తప్పేమిటని ప్రశ్నించారు.