Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నఫలంగా తొలగించిన సింగరేణి యాజమాన్యం
- కరోనా సమయంలో వెలకట్టలేని సేవలు
- కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతో రూ.కోట్లు దండుకున్న దళారులు
- లక్షలు పెట్టి రోడ్డున పడిన బాధితులు
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
కాంట్రాక్టు కొలువు.. నిరుద్యోగుల జీవితాలను కకావికలం చేస్తోంది. కోల్బెల్ట్ ఏరియాలో కొందరు వ్యక్తులు కాంట్రాక్టు ఉద్యోగాలు ఎరగా వేసి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. ఉపాధి దొరుకుతుందనే భరోసా, భవిష్యత్లో పర్మినెంట్ ఉద్యోగిగా మారిపోతామనే ఆశతో లక్షల రూపాయలు ముడుపులుగా చెల్లించి కాంట్రాక్టు ఉద్యోగాలు కొనుక్కుంటున్నారు నిరుద్యోగులు. ఈ వ్యవహారంలో ఆరితేరిన కొందరు వ్యక్తులు దాదాపు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. కాగా కాంట్రాక్టు కార్మికులను సింగరేణి యాజమాన్యం ఉన్నట్టుండి తొలగించడంతో బాధితుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.గోదావరిఖని సింగరేణి ప్రాంతీయ వైద్యశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్య సిబ్బందిని నియమించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకోసం అనుభవం కలిగిన కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో నర్సింగ్, వార్డ్ బారు, ఆయా తదితర పోస్టులను భర్తీ చేయడానికి యజమాన్యం శ్రీకారం చుట్టింది. గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలోనే దాదాపు 50 మందికిపైగా కాంటాక్ట్ సిబ్బందిని నియమించినట్టు సమాచారం. కొంతమంది కాంట్రాక్టు పద్ధతిలో జరిగే నియామకాలకు లక్ష రూపాయలు వసూలు చేసే పద్ధతికి తెరలేపారు. కాంట్రాక్ట్ కార్మికుల నుంచి దాదాపు రెండు రూ.కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.
కాంట్రాక్ట్ కార్మికుడిగా ఒకసారి విధుల్లో చేరితే ఉద్యోగానికి ఢోకా ఉండదని, కాంట్రాక్టర్ మారినా కార్మికుల్ని తొలగించే సమస్య ఉండదని నమ్మబలికారు. భవిష్యతులో పర్మినెంట్ ఉద్యోగిగా సింగరేణి యాజమాన్యం నియమించే అవకాశాలుంటాయని దళారులు నిరుద్యోగుల్లో ఆశలు పెంచారు. ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల వరకు వసూలు చేశారు.
ఉద్యోగాలు వచ్చిన నర్సింగ్ సిబ్బందికి నెలకు రూ.16 వేల జీతభత్యాలు చెల్లించారు. అందులో నుంచి రూ.రెండు వేల వరకు పీఎఫ్, తదితర మినహాయింపులున్నాయని చేతికి 14వేల రూపాయలు మాత్రమే వచ్చేవని బాధితులు తెలిపారు. సింగరేణి ప్రాంతంలో నూటికి రూ.3నుంచి రూ.10 వడ్డీ వ్యాపారం జరుగుతున్నది బహిరంగ రహస్యమే. కాగా బాధితుల చేతికి అందిన జీతం ఉద్యోగం కోసం తెచ్చి కట్టిన అప్పు వడ్డీకి కూడా సరిపోని పరిస్థితి.
అయితే, ఇటీవల సింగరేణి యాజమాన్యం ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష ద్వారా ఎంపిక చేసిన నర్సింగ్ సిబ్బందికి గోదావరిఖనిలో విధులు కేటాయించింది. వీరి రాక వల్ల 20 మంది కాంట్రాక్టు సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. ఎన్నో ఆశలతో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని అకస్మాత్తుగా తొలగిస్తున్నట్టు టెలిఫోన్ ద్వారా సమాచారం పంపారు. దాంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది... కార్మికుల పరిస్థితి. యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని బాధితులు కోరుతున్నారు.
కోవిడ్ సేవల్లో ముందు..
కోవిడ్ ఉధృతంగా ఉన్న కాలంలో సింగరేణి పర్మినెంట్ వైద్య సిబ్బందిలో కొందరు భయంతో విధులకు దూరంగా ఉన్నారని, తాము మాత్రం ప్రాణాన్ని ఫణంగా పెట్టి రోగులకు సేవలు అందించామని కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి వైద్యశాలలో మాకు మాత్రమే ఉచితంగా వైద్యం లభించిందని, తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త, పిల్లలకు వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రయివేటులో వైద్యం చేయించామని పలువురు కాంట్రాక్టు నర్సులు బాధతో తెలిపారు. కన్న పిల్లలకు కరోనా వచ్చి పోరాడుతున్నా.. తాము మాత్రం వేలాది మంది కరోనా రోగుల సేవలో ముందు వరుసలో నిలబడిన విషయం గుర్తుకు తెచ్చుకుని కన్నీరు పెట్టుకున్నారు. వీటన్నింటినీ అర్థం చేసుకుని యాజమాన్యం తమను కొనసాగించాలని కోరుతున్నారు.