Authorization
Sat April 05, 2025 07:37:19 am
- కొత్త తెగుళ్లతో రైతన్నల పరేషాన్
- ఎనుమాములకు పోటెత్తిన్న కోల్డ్‌స్టోరేజ్ మిర్చి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఏడాది మిర్చి తోటలకు కొత్త తెగులు (వైరస్) సోకడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. నల్లతామర తో సగటున 60-70 శాతం దిగుబడి తగ్గింది. ఈ మేరకు మిర్చి రాబడులు మార్కెట్లో తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో బుధవారం మిర్చికి క్వింటాల్‌కు రూ.9,820 ధర పలికింది. గత రెండేండ్లతో పోల్చి చూస్తే ఎనుమాముల మార్కెట్‌కు ఈసారి జనవరిలో అధికంగా మిర్చి రాబడులు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం గతేడాది లాక్‌డౌన్‌తో ధర లేక కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్న మిర్చిని తెచ్చి ఇప్పుడు అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఈ సరుకు తాజాగా మార్కెట్‌ను ముంచెత్తుతున్నది. భారీ వర్షాల అనంతరం డిసెంబర్, జనవరి నెలల్లో మిర్చి రాబడులు పెరిగాయి. 2021 డిసెంబర్లో మిర్చికి రూ.13,536 ధర దక్కగా, జనవరిలో ఎనుమాముల మార్కెట్లో సరాసరి క్వింటాల్‌కు రూ. 13,597 ధర దక్కింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మిర్చి తోటలకు కొత్త తెగుళ్లు సోకాయి. నల్ల తామర వైరస్‌తో మిర్చి పంట దిగుబడులు 60-70 శాతం తగ్గాయి. ఈ క్రమంలో మిర్చి రైతులు నల్లతామరను నియంత్రించడానికి పెద్ద ఎత్తున క్రిమిసంహారక మందులు పిచికారి చేసి తీవ్రంగా నష్టపోయారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన గూబ మహేందర్ (26) మిర్చి నష్టాలకు తాళలేక సంక్రాంతి పండుగ రోజే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా నల్లతామరతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అంతేకాదు, భారీ వర్షాలతో చేతికొచ్చిన కొద్ది మిర్చి రాలిపోయింది. ఒకవైపు వ్యాధులు, మరోవైపు భారీ వర్షాలతో మిర్చి దిగుబడులు గణనీయంగా తగ్గాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే కొద్దోగొప్ప మిర్చి రాబడులు మార్కెట్‌కు చేరే అవకాశముంది.
తగ్గిన రాబడులు..
ఈ మార్కెట్ సీజన్లో గతేడాది మిర్చి కోవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున కోల్ స్టోరేజీలో నిల్వ చేసుకున్నారు. తాజాగా ఈ సీజన్లో కొత్త దిగుబడుల కంటే కోల్డ్ స్టోరేజీ నుంచి వెలికి వచ్చిన మిర్చి రాబడులే మార్కెట్లో అధికంగా ఉన్నాయి. వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు 2019-20 జనవరిలో 44,906 క్వింటాళ్ల మిర్చి రాగా రూ.21,500 గరిష్ట ధర, రూ.9,500 కనిష్ట ధర పలికింది. 2020-21లో 20 వేల 785 క్వింటాళ్ల మిర్చికి ధర గరిష్టంగా రూ.24,000 కనిష్టంగా రూ.9,500 ధర పలికింది. మోడల్ ధర రూ.13,144 వచ్చింది. 2021-22 జనవరిలో 57,336 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. గరిష్ట ధర రూ.26 వేలు, కనిష్ట ధర రూ.10 వేలు, మోడల్ ధర రూ.13,597 పలికింది. 2019-20 అక్టోబర్‌లో 12,422 క్వింటాళ్ల మిర్చి రాగా, గతేడాది అక్టోబర్‌లో 6,698 క్వింటాళ్ల మిర్చి మాత్రమే వచ్చింది. 2019-20 నవంబర్‌లో 9,020 క్వింటాళ్ల మిర్చి రాగా, గత ఏడాది నవంబర్‌లో 37 వేల 459 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. నవంబర్ మాసం నుంచి కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న సరుకు మార్కెట్‌ను ముంచెత్తింది. 2019-20 డిసెంబర్లో 14,295 క్వింటాళ్ల మిర్చి రాగా అదే ఏడాది డిసెంబర్లో 8,604 క్వింటాళ్లు, 2021 డిసెంబర్లో 40,193 క్వింటాళ్ల మిర్చి రాబడులు వచ్చాయి.