Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లుగా విడుదలకాని వైనం..
- ఉమ్మడి పీహెచ్డీ ప్రవేశాలను వ్యతిరేకిస్తున్న విద్యార్థులు
- వీసీలంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది : ఓయూ వీసీ ప్రొ.రవీందర్
నవతెలంగాణ-ఓయూ
సెంట్రల్ అండ్ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలకు అన్ని విషయాల్లో ఆదర్శంగా ఉండే ఉస్మానియా యూనివర్సిటీ.. ఐదేండ్లుగా పీహెచ్డీ నోటిఫికేషన్ జారీ చేయడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందోనని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. వర్సిటీకి పరిశోధనలు, ప్రాజెక్ట్స్, ఎంఓయూల ద్వారా మంచి గుర్తింపు వస్తుంది. అలాంటిది పీహెచ్డీలే లేకపోతే ఎలా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు అనేకమార్లు పీహెచ్డీ నోటిఫికేషన్ వేయాలని రిజిస్ట్రార్‌కు వినతిపత్రాలు అందజేశారు. అయినా 2017 నుంచి నోటిఫికేషన్ వేయలేదు.కొంతకాలం ఇన్చార్జి వీసీ ఉండటం వల్ల కూడా ఓయూ అధికారులు ఆ దిశగా ఆలోచించలేదు. రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేండ్లవుతోంది. రాష్ట్ర సాధనలో ఓయూ విద్యార్థుల పాత్ర, త్యాగం ఎంతగొప్పదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యమంలో పాల్గొని అనేక విధాలుగా విద్యా ర్థులు నష్టపో యారు. ఓయూలో చదివేది ఎక్కువగా పేద, మధ్యతరగతి గ్రామీణ ప్రాంత విద్యార్థులే. ఓయూ వీసీ దీన్ని దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ జారీ చేయాలని వారు కోరుతున్నారు. మరోవైపు డీన్స్ నుంచి వివిధ విభాగాల్లో ఖాళీల వివరాల జాబితా తయారు చేస్తున్నారు.
డైలమాలో నోటిఫికేషన్ ?
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలకు ఉమ్మడి పీహెచ్డీ నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత విద్యామండలిలో గతంలో ఒకసారి చర్చ జరిగింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఉన్నత విద్యామండలి కానీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఒక్క వీసీ మాత్రమే ఉమ్మడి పీహెచ్డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయాలన్న వాదనను తెరపైకి తెచ్చాని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఓయూ స్టూడెంట్స్ ఉమ్మడి పీహెచ్డీ నోటిఫికేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. గతంలో మాదిరిగా ఏ యూనివర్సిటీకి సంబంధించి ఆ యూనివర్సిటీనే పీహెచ్డీ ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొ.లింబాద్రికి వినతిపత్రం ఇచ్చారు.
యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండి కూడా.. ఉన్నత విద్యామండలి ఉమ్మడి పీహెచ్డీ ప్రవేశాలు అంటోందన్న సాకుతో పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదలకు చర్యలు చేపట్టడం లేదు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష పెట్టొద్దని, వర్సిటీల వారీగానే పీహెచ్డీ నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యార్థు లు కోరుతున్నారు. అయితే, మార్చిలో జరగనున్న స్టేట్ కౌన్సిల్లో వీసీలందరూ కలిసి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ తెలిపారు.