Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తవేం లేవు... పాతవాటికీ కొన్నే...
- రాష్ట్రానికి రైల్వే నిధుల కేటాయింపులో కేంద్రం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే...ఆరు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్), ఆరు డివిజన్లు (సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్), 95,222 శాంక్షన్ పోస్టులు, 79,193 ప్రస్తుత ఉద్యోగులు, 242.70 కోట్ల మంది ప్రయాణీకులు, కరోనా- లాక్డౌన్ ఏడాదిలో ఆదాయం రూ.11వేల కోట్లు...ఇదీ స్థూలంగా ఆ సంస్థ రూపం. దేశంలోనే రైల్వే ప్రయాణీకులు, సరకు రవాణాలో నెంబర్ వన్. ఆదాయంలో ఫస్ట్. విస్తరణకు అనేక అవకాశాలు. కానీ కేంద్రప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన సొమ్ము కేవలం రూ. 10,080 కోట్లు. తెలంగాణలో ఒక్క కొత్త రైల్వే లైను, రూటు లేదు. వందేండ్లు దాటిన పాతలైన్లను ఆధునీకరించడం, డబ్లింగ్, విద్యుదీకరణ, ట్రాఫిక్ వసతుల కోసం ప్రస్తుత బడ్జెట్లో కేవలం రూ.3,048 కోట్ల నిధులు కేటాయించారు. అంకెల్లో గతేడాదికంటే 26 శాతం అధికంగా నిధులు కనిపిస్తున్నా, కొత్తగా విస్తరణ పనులు ఒక్కటీ లేవు. ఎమ్ఎమ్టీఎస్ రెండో దశ ఊసే లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్ని ఇవ్వలేదనే సాకును చూపి మొత్తానికే అటకెక్కించేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉనికిలోనే లేకుండా పోయింది. గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ వర్చువల్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కేటాయింపుల వివరాలు వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన 400 వందే భారత్ ప్రత్యేక రైళ్లలో ఒక్కటీ రాష్ట్రానికి కేటాయించలేదు. అది మూడేండ్ల ప్రాజెక్ట్ అనీ, భవిష్యత్లో ఏమైనా ఇస్తారేమో చూద్దాం అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సంజీవ్ కిషోర్ చెప్పారు. రాష్ట్రనికి రైల్వే కేటాయింపులు ఆయన మాటల్లోనే...
- 1997-98 సంవత్సరంలో మంజూరైన మునీరాబాద్-మహబూబ్నగర్ రైల్వేలైన్ ప్రాజెక్ట్ కొనసాగింపు కోసం రూ.289 కోట్లు కేటాయించారు.
- 2010-11లో మంజూరైన భద్రాచలం-సత్తుపల్లి రైల్వేలైన్ పనుల కొనసాగింపునకు రూ.163 కోట్లు కేటాయించారు. రూ.928 కోట్ల వ్యయంతో మంజూరైన ఈప్రాజెక్ట్లో సింగరేణి కాలరీస్ భాగస్వామి. ఖర్చులో సగభాగాన్ని ఈ సంస్థ కూడా పంచుకుంటుంది.
- 2006-07లో మంజూరైన మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ పనుల కొనసాగింపునకు రూ.160 కోట్లు కేటాయింపు. దీనిలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామి.
- 2012-13లో మంజూరైన అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనుల కొనసాగింపునకు రూ.41 కోట్లు కేటాయింపు. దీనిలో రాష్ట్రం 50 శాతం భాగస్వామి.
- 2015-16లో మంజూరైన సికింద్రాబాద్-మహబూబ్నగర్ లైన్లో డబ్లింగ్, విద్యుదీకరణకు రూ.150 కోట్లు కేటాయింపు.
- 2017-18లో మంజూరైన పర్లి వైద్యనాధ్-వికారాబాద్ సెక్షన్లో విద్యుదీకరణ పనుల కోసం రూ.109 కోట్లు కేటాయింపు.
- 2017-18లో మంజూరైన లింగపేట జగిత్యాల-నిజామాబాద్ రూట్లో విద్యుదీకరణ కోసం రూ.39 కోట్లు.
- కాజీపేట పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్)కు రూ.45 కోట్లు కేటాయింపు.
- చెర్లపల్లి స్టేషన్ వద్ద శాటిలైట్ టెర్మినల్ నిర్మాణానికి రూ.70 కోట్లు.
- ఉందానగర్-తిమ్మాపూర్ స్టేషన్ల మధ్య కొత్త క్రాసింగ్ స్టేషన్ నిర్మాణం కోసం రూ.7 కోట్లు కేటాయింపు.
- ఇవి కాకుండా భద్రత, మౌలిక సదుపాయాల కోసం కొన్ని నిధుల్ని కేటాయించారు.