Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి ఏటా 13 లక్షల మందికి...
- జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శుక్రవారం ప్రపంచ క్యాన్సర్ డే. ప్రపంచాన్ని వణికిస్తున్న రోగాల్లో ఇదొకటి. ప్రతి ఏటా దాదాపు 13 లక్షల మంది దీని బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. క్యాన్సర్ అనేది శరీరంలోని ఒక అవయవానికి, అక్కడి కణజాలంలో మొదలయ్యే వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మం, గొంతు, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్ తదితర 100 రకాలు గుర్తించబడ్డాయి. ప్రతి ఏడాది అనేక మంది ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్నారు.
క్యాన్సర్ అంటే ఏమిటి?
శరీరం కణజాలంతో నిండి ఉంటుంది. ఆ కణాలు విభజన చెందుతూ అవసరం లేని కణాలు చనిపోతుంటాయి. అయితే అవసరం లేని కణాలు చనిపోకుండా ఉంటే అది క్యాన్సర్‌గా మారుతుంది. డీఎన్ఏలో మార్పుల వల్ల ఇది జరుగుతుంది. తల్లిదండ్రుల లక్షణాలు, ఆహారపు అలవాట్లు, రేడియేషన్, పొగ పీల్చడం, ఊబకాయం తదితర కారణాల వల్ల కూడా డీఎన్ఏలో మార్పులు వచ్చి క్యాన్సర్‌కు దారి తీస్తాయి.
ప్రాథమిక దశలో గుర్తించాలి
క్యాన్సర్ నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి రెండు దశల్లో గుర్తిస్తే వైద్యంతో 90 శాతం వరకు నయం చేయొచ్చు. అదే నాలుగో దశలో గుర్తిస్తే 22 శాతమే నయం చేసే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రారంభంలో నయం చేయించుకుంటే తిరిగి మెరుగైన జీవితాన్ని గడిపే వీలుంది. క్లినికల్, మెడికల్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్, ల్యాబొరేటరీ టెస్టుల ద్వారా వ్యాధిని నిర్దారిస్తున్నారు. స్క్రీనింగ్, అల్ట్రాసౌండ్, డిజిటల్ మామోగ్రఫీ, ట్రూ-కట్ బయాప్సీ, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, పీఈటీ స్కాన్, ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ వంటి అధునాతన పద్ధతుల ద్వారా కూడా క్యాన్సర్‌ను గుర్తిస్తున్నారు. వీటితో పాటు ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ, ఇన్ సిటు హైబ్రిడైజేషన్, రియల్ టైమ్ పీసీఆర్, ఫ్లో సైటోమెట్రీ, మైక్రో అరే, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, లిక్విడ్ బయాప్సీ వంటి పద్ధతులు కూడా క్యాన్సర్ నిర్దారణ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
చికిత్స
క్యాన్సర్ నిర్దారణ అయిన తర్వాత సర్జన్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఇతర వైద్య నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ టీమ్ ద్వారా చికిత్స పొందవచ్చు. క్యాన్సర్ రకం, దాని దశ, రోగి స్టేజ్‌ని బట్టి చికిత్స విధానాలు ఉన్నాయి. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సా విధానాలతో క్యాన్సర్ కొంత అదుపులోకి వస్తున్నది.
అవగాహన పెంచుకోవాలి ...డాక్టర్ పాలంకి
క్యాన్సర్ పట్ల ప్రజలు అవగా హన పెంచుకోవాలని రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్ డాక్టర్ పాలంకి దత్తాత్రేయ సూచించారు. కొద్ది పాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాల మీదికి తెస్తున్నదని హెచ్చరించారు. చికిత్స చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను నయం చేసుకునేందుకు వీలుందని వెల్లడించారు.