Authorization
Sat April 05, 2025 05:55:43 am
- ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆరోగ్య సంరక్షణకు అవసరమైన సాంకేతికతను సమకూర్చే ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ సంస్థ రాబోయే 18 నెలల్లో అదనంగా 14 వందల మంది ఉద్యోగులను తీసుకోవాల నుకుంటున్నట్టు ప్రకటించింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ నగరాల్లో వీరు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వాషింగ్టన్ డీసీ ప్రధాన కేంద్రంగా ఈ కంపెనీ పని చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్న ఈ కంపెనీ వరంగల్, ఖమ్మం జిల్లాలో రెండు డెలివరీ సెంటర్లను కొత్తగా తెరవడంతో పాటు కరీంనగర్లో ఇప్పటికే 200 మంది ఉద్యోగులతో నడుస్తున్న బ్రాంచ్‌ను విస్తరించాలనే యోచనలో ఉన్నది. వరంగల్, ఖమ్మంలో కొత్త సెంటర్లతో 300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అలాగే కరీంనగర్లో 300 మందికి, హైదరాబాద్‌లో 500 మందికి ఉపాధి లభించనున్నది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ గ్రూప్ సీఈవో కార్తీక్ పొల్సానీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు అందుబాటులోకి తీసుకురావాలన్న రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యానికి సహకరిస్తున్నందుకు ఎక్లాట్ సొల్యూషన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని వెల్లడించారు.