Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడుల్లో ఉన్నత ప్రమాణాల కోసమే 'మన ఊరు-మనబడి' :మంత్రి సబితా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉన్నత ప్రమాణాలతో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసమే ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నదని వివరించారు. గురువారం హైదరాబాద్‌లోని ఆమె తన ఛాంబర్లో విద్యాశాఖ అధికారులతో ఈ కార్యక్రమంపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని టీసీఎస్‌ను కోరారు. పాఠశాలల వారీగా జాబితా రూపొందించి పూర్తిస్థాయి నివేదికను త్వరితగతిన అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను రూ.7,289 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. తొలిదశలో 9,123 పాఠశాలల్లో 12 రకాల కనీస సౌకర్యాలను కల్పించేందుకు రూ.3,497 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. ప్రతి జిల్లాలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు వారి పరిధిలోని పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టిసారించి పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చదివించే అవకాశం కోసం ఎదురుచూసే పరిస్థితి వస్తుందని తెలిపారు. త్వరలోనే మంత్రులు, స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ పథకం అమలుకు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. ఈ పథకం విద్యారంగంలో దేశానికి ఆదర్శం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఎండీ పార్థసారధి, టీసీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.