Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మానవ సమాజానికి సామాజిక సమతా సూత్రాన్ని అందించిన శ్రీరామానుజాచార్యుల బోధనలకు వెయ్యేండ్ల తరువాత తెలంగాణ రాష్ట్రం కేంద్రం కావడం ఎంతో గొప్ప విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది సమరోహ కార్యక్రమాల సందర్భంగా సీఎం కేసిఆర్ గురువారం కార్యస్థలిని సతీ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . శ్రీ రామానుజాచార్యుల వారు భక్తి ఉద్యమంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చారని చెప్పారు. మానవులు అందరూ సమానమని ప్రవచించారని తెలిపారు. సమానత్వం కోసం వెయ్యేండ్ల క్రితమే ఎంతో కృషి చేశారన్నారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు, పర్యాటకులకే కాకుండా మానసిక ప్రశాంతత కోరుకునే ప్రతీ ఒక్కరికీ ఇది ప్రశాంత నిలయంగా మారుతుందని చెప్పారు. సమతా మూర్తి విగ్రహ స్థాపన దేశం గర్వించదగిన గొప్ప నిర్మాణానమనీ ఆన్నారు. అనతికాలంలోనే ఈ సమతామూర్తి వేదిక ప్రపంచ ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విశేష ప్రాచుర్యం పొందనున్నదని సీఎం తెలిపారు. కులాలకు, మతాలకు అతీతంగా విభిన్న సాంస్కృతిక, సాంప్రదాయాలను ఏకతాటిపైన నడిపించే సామాజిక సమతను తాము కొనసాగిస్తామన్నారు. సమరోహనికి హాజరవుతున్న ముఖ్య అతిథులకు కావాల్సిన ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుందని సీఎం అన్నారు. తమ కుటుంబం తరపున ఈ మహా ఉత్సవానికి వచ్చే పండితులు భక్తుల కోసం ఫలాలు, ప్రసాదాన్ని పండ్లను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని రాకల సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రతకోసం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం పరిశీలించారు. భద్రత ఏర్పాట్ల గురించి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మైహౌం అధినేత జూపూడి రామేశ్వరరావు, ఎంపీ సంతోష్ కుమార్, ముఖ్యమంత్రి మనుమడు హిమాన్షు రావు, ఎమ్మెల్సీ లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు, ఏపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.