Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతిభవన్ వెళ్లకుండా నిర్భంధం
- ఎస్కార్ట్ వాహనంలో బీఆర్కే భవన్‌కు తరలింపు
- అక్కడే వినతిపత్రం ఇవ్వాలని షరతు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీలో కార్మిక సంఘాల ఉనికిని ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తున్న విషయం తెలిసిందే. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మొన్నటికి మొన్న బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన పది కార్మిక సంఘాల నేతృత్వంలోని జేఏసీ నేతల్ని అక్కడే పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఏ వినతిపత్రం అయినా అక్కడి సెక్యూరిటీ గార్డులకు ఇచ్చి వెళ్లాలని పోలీసులు చెప్పడంతో జేఏసీ నేతలు అక్కడికక్కడే ఆకస్మిక ధర్నాకు దిగారు. దీనితో ఎట్టకేలకు ఆర్టీసీ చైర్మెన్ వారి నుంచి వినతిపత్రం స్వీకరించక తప్పలేదు. తాజాగా గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, వేతన సవరణ తదితర అంశాలపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రగతి భవన్ వెళ్ళాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. వీఎస్టీ సమీపంలోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయ ం నుంచి ప్రగతిభవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు అక్కడే నిర్భంధించారు.ప్రగతి భవన్ వెళ్లేందుకు వీల్లేదనీ, తాము అనుమతించమనీ స్పష్టం చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం అని జేఏసీ నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. చివరకు పోలీసుల ఎస్కార్ట్ వాహనంలో జేఏసీ నేతల్ని బీఆర్కే భవన్‌కు తీసుకెళ్తామనీ, అక్కడి ఇన్వార్డ్ సెక్షన్లో వినతిపత్రం ఇచ్చి, శాంతియుతంగా వచ్చేయాలని షరతు విధించారు. దీనిపైనా జేఏసీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. తాము ఎందుకు ప్రభుత్వాన్ని కలువకూడదో చెప్పాలంటూ వాగ్వివాదానికి దిగారు. ఓ దశలో అరెస్టు చేస్తామంటూ పోలీసులు బెదిరింపులకూ పాల్పడ్డారని జేఏసీ నేతలు చెప్పారు. ఎట్టకేలకు పోలీసు ఎస్కార్టు వాహనంలో జేఏసీ నేతల్ని బీఆర్కే భవన్‌కు తీసుకెళ్లి, అక్కడి ఇన్వార్డ్ సెక్షన్లో మొమోరాండం ఇప్పించారు. ఈ చర్యల్ని నిరసిస్తూ జేఏసీ నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్భంధాన్ని తీవ్రంగా ఖండించారు. వినతిపత్రాన్ని మెయిల్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా ముఖ్యమంత్రికి పంపినట్టు నేతలు తెలిపారు. జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి, వైస్‌చైర్మెన్ కే హన్మంతు ముదిరాజ్, కన్వీనర్లు వీఎస్ రావు, పి కమాల్‌రెడ్డి, కో కన్వీనర్లు పి రమేష్‌కుమార్, జీ అబ్రహం, కే యాదయ్య, బీ సురేష్, పి హరికిషన్, బీ యాదగిరి వినతిపత్రంపై సంతకాలు చేశారు.