Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్లో 'ఉపాధి హామీ'కి ఏటా కోతే!
- 2009-10లో రూ.10లక్షల కోట్ల బడ్జెట్లో రూ.40వేల కోట్లు కేటాయిస్తే..
- ఈ ఏడాది రూ.40లక్షల కోట్లలో కేటాయించింది రూ.75కోట్లు మాత్రమే!
- అదీ ఏడాదిలో సగటు పని దినాలు 42రోజులే!
- రోజుకు కూలీకి గిట్టుబాటయ్యేది సగటున రూ.170
- గ్రామాలను విలీనం చేస్తూ 'ఉపాధి'కి తూట్లు
- ఉమ్మడి కరీంనగర్లో అలా ఉపాధి కోల్పోయింది 70 గ్రామాలపైనే..
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉపాధి హామీని నిర్వీర్యం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు వామపక్షాల ఒత్తిడితో యూపీఎ-1లో తీసుకొచ్చిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచే దిశగా ఏటా బడ్జెట్లో కోతలు విధిస్తూ వస్తోంది. 2009లో కేంద్ర బడ్జెట్ రూ.10లక్షల కోట్లలో ఉపాధి హామీకి రూ.40వేల కోట్లు (4శాతం) కేటాయించారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన రూ.39.44లక్షల కోట్ల బడ్జెట్లో వాస్తవానికి రూ.లక్షా 57వేల కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ, గతేడాది రూ.98వేల కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది కేవలం రూ.73వేల కోట్లే కేటాయించింది. ఇప్పటికే సగటున 48రోజుల పని మాత్రమే దొరుకుతుండగా.. రోజుకు రూ.170 కూడా గిట్టుబాటుకావడం లేదు. ఈ నేపథ్యంలో ఏడాదికేడాది నిధుల కోత విధిస్తుంటే ఆ మాత్రం పనులూ దొరికే పరిస్థితి లేదు. పైగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండు కార్పొరేషన్లు, 14మున్సిపాలిటీల్లో విలీనమైన సుమారు 70 గ్రామాలు ఇప్పటికే 'ఉపాధి'ని కోల్పోయాయి. ఈ నెల 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2022-23 కేంద్ర బడ్జెట్లో ఆసాంతం కార్పొరేటర్లకు రాయితీలు, లబ్ది చేకూర్చే అంశాలే ప్రధానంగా ఉన్నాయి.
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ఒక్క బలమైన అంశమూ బడ్జెట్లో లేదు. పైగా గ్రామీణ పేదలకు ఎంతో కొంత పని కల్పిస్తున్న ఉపాధి హామీనీ నిర్వీర్యం చేస్తూ గతేడాది కంటే రూ.25వేల కోట్లకు కోత విధించింది. 2009లోనే రూ.10 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో రూ.40 వేల కోట్లు అనగా నాలుగు శాతం కేటాయించగా.. ప్రతియేటా కోతలు విధిస్తూ వస్తోంది. 2019-20లో 30లక్షల కోట్ల బడ్జెట్లో రూ.61వేల కోట్లే విధించిన కేంద్ర సర్కారు.. గతేడాది రూ.98వేల కోట్లు కేటాయించింది. ఈ ఏడాది ఏకంగా రూ.25వేల కోట్ల కోత విధిస్తూ కేవలం రూ.73వేల కోట్లే కేటాయించింది. ఈ పరిణామాలు ఆ ఏడాదిలో పని కల్పించే ఉపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఉమ్మడి కరీంనగర్‌లోని నాలుగు జిల్లాల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 5,52,932కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా.. 2021-22 ఏడాదికిగాను ఇప్పటివరకు 2,51,677 కుటుంబాలకు మాత్రమే పని కల్పించారు. ఏడాదిలో వంద రోజుల పనికిగాను సగటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 48రోజులే పని కల్పించగా.. రోజుకు రూ.170 కూలి గిట్టుబాటు కాలేదు. రెక్కలు, ముక్కలు చేసుకుని పనిచేస్తే దానికీ సరిగా వేతనాలు చెల్లించడం లేదు. చట్టం ప్రకారం రోజుకు రూ.211 కూలి చేతికి అందడం లేదు. సగటు కూలి రూ.151 నుంచి రూ.170 వరకు పడుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో రూ.125 కూడా దక్కట్లేదని సర్వేలు చెబుతున్నాయి.
'ఉపాధి' లేకుండా చేస్తున్నారు
గుడికందుల సత్యం, సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
దేశవ్యాప్తంగా ఉద్యోగాల కల్పన ఊసే లేకపోగా.. గ్రామీణ పేదలకు పని కల్పించే 'ఉపాధి'నీ లేకుండా చేస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఉపాధి హామీకి రూ.25వేల కోట్లు కోత విధిస్తే.. వ్యవసాయ రంగానికి ఏకంగా రూ.35వేల కోట్లు కోత విధించారు. బీజేపీ ప్రభుత్వం గ్రామీణ పేదల జీవితాలతో చలగాటం ఆడుతోంది.
ఎక్కడి సమస్యలు అక్కడే..
ఉపాధి హామీ చట్టం నిర్వహణలో అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. పని ప్రదేశాల్లో కూలీలకు దెబ్బతగిలితే వెంటనే ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రతి గ్రూపునకూ మెడికల్ కిట్లు ఉండాలి. ఇది చట్ట నిబంధన. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా అమలు కావ డం లేదు. గడ్డపారలు, పారలు, ఇతర పనిముట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పనిప్రదేశాల్లో టెంట్లు ఇవ్వాల్సి ఉండగా.. వేడిని ఎక్కువగా గ్రహించే టార్పాలిన్ కవర్లను అందిస్తున్నారు. ఇక వేసవిలో అదనంగా ఇవ్వాల్సిన అలవెన్సులకు కేంద్రం కోతపెట్టే ఆలోచనలో ఉన్నట్టూ తెలుస్తోంది.
2021-2022 ఆర్థిక సంవత్సరంలో కల్పించిన 'ఉపాధి' వివరాలు
జిల్లా పని కల్పించిన వందరోజుల పనిలో రోజుకు కూలీకి ఇచ్చిన
కుటుంబాలు సగటు పనిదినాలు సగటు వేతనం
కరీంనగర్ 62621 42రోజులు రూ.153
పెద్దపల్లి 56659 42రోజులు రూ.173
సిరిసిల్ల 51968 48రోజులు రూ.202
జగిత్యాల 80429 40రోజులు రూ.188
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు ఆయా కుటుంబాలకు ఇచ్చిన జాబ్‌కార్డులు, కూలీల వివరాలు
జిల్లా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరులు కూలీలు
కరీంనగర్ 155738 43160 1545 94958 16075 328917
పెద్దపల్లి 125143 27485 3068 87097 7492 269568
సిరిసిల్ల 106351 28163 7216 59946 11026 230291
జగిత్యాల 165700 41752 7168 104300 12480 297962