Authorization
Tue April 08, 2025 02:09:02 am
- ఉదాశీనత తగదు: హైకోర్టు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అన్ని మతపరమైన కార్యక్రమాల్లోనూ కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా తగ్గిపోయిందనే కారణంతో ఉదాశీనంగా ఉండొద్దని హెచ్చరించింది. అన్ని విద్యా సంస్థల్లో ప్రత్యక్ష విద్యాబోధనతోపాటు ఆన్ లైన్ బోధన కూడా ఈ నెల 20 వరకు చేపట్టాలని చెప్పింది. కరోనాపై దాఖలైన పలు వేర్వేరు పిల్స్‌ను గురువారం చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారించింది. అనంతరం ఉత్తర్వులు జారీ చేసింది. వారాంతపు సంతల్లో జనం ఎక్కువగా ఉంటున్నారనీ, అయితే వాటికి వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేయలేమని చెప్పింది. రోజు వారీ సంతల్లో కూరలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునే చిరు వ్యాపారుల విషయాన్ని మానవీయకోణంలో చూడాలని హితవు పలికింది. వారాంతపు సంతల కంటే బార్లు, రెస్టారెంట్లతోనే ఎక్కువ ప్రమాదమని అభిప్రాయపడింది. వీటిలో కూడా కరోనా నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. సమ్మక్క సారక్క జాతర, సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్‌ను ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై 28వ తేదీన జరిగే తదుపరి విచారణ నాటికి నివేదిక అందజేయాలని ఆదేశించింది. 'రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.40శాతంగా ఉంది. రాష్ట్రంలో రోజుకు లక్షపైగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. మందులు, పడకలు,ఆక్సిజన్ అన్నీ రెడీగా ఉన్నాయి. 99లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే చేశాం. జ్వర లక్షణాలున్న 4.32 లక్షల మందికి మెడికల్ కిట్లు ఇచ్చాం. సమ్మక్క సారక్క జాతరకు కోవిడ్ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం'... అని హెల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు చెప్పారు. నారాయణ పేటలో 8.88, కామారెడ్డిలో 8.32, ఆసిఫాబాద్ లో 8 శాతం, జీహెచ్ ఎంసీలో 4.64, మేడ్చల్ లో 3.76, గద్వాలలో 1.45శాతం పాజిటివిటీ రేటు ఉందన్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా లేనందున విద్యా సంవత్సరం నష్ట పోకుండా తీసుకున్న చర్యల్లో భాగంగానే బడులు, కళాశాలలు తెరిచామ న్నారు. అనంతరం కోర్టు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.