Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దశలవారీగా మౌలిక వసతులు
- 12 రకాల అంశాలను గుర్తించిన ప్రభుత్వం
- జిల్లా కలెక్టర్లకే పనుల బాధ్యత అప్పగింత
- 'మన ఊరు-మనబడి'కి రూ.7,289 కోట్లు
- తొలిదశలో 9,123 స్కూళ్ల బాగుకు రూ.3,497 కోట్లు
- మార్గదర్శకాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం నడుంబిగించింది. అందులో భాగంగానే 'మన ఊరు-మనబడి ' పథకానికి శ్రీకారం చుట్టింది. సర్కారు బడుల రూపురేఖలు మారబోతున్నాయి. కొత్తహంగులతో మౌలిక వసతుల కల్పనతో అభివృద్ధి చెందనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా మౌలిక వసతులను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గురువారం (జీవోనెంబర్ 4) ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుపరచడం కోసం 'మన ఊరు-మన బడి', 'మన బస్తీ/మన బడి' కార్యక్రమానికి రూ.7,289.54 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ జీవోలో పథకం అమలు, ప్రభుత్వ లక్ష్యాలను పొందుపరిచారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన
కోసం 12 అంశాలను గుర్తించామని వివరించారు. అదనపు తరగతి గదుల నిర్మాణం, పాఠశాలల్లో మరమ్మతులు, అవసరమైన ఫర్నీచర్ ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, డిజిటల్ క్లాస్ రూంలతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, నీటి వసతి ఉండేలా చూడడం, పాఠశాల భవనానికి రంగులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీగోడల నిర్మాణం, కిచెన్షెడ్లు, ఉన్నత పాఠశాలల్లో భోజనశాల వంటి మౌలిక వసతులను కల్పిస్తామని వివరించారు. మౌలిక వసతుల కల్పన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును పెంచడంతోపాటు చేరికను పెంచడం, నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వం లక్ష్యమని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో 'మన ఊరు-మనబడి', పట్టణ ప్రాంతాల్లో 'మన బస్తీ- బడి' పేరుతో ఈ పథకం అమలు జరుగుతుందని వివరించారు.
మూడేండ్లలో మౌలిక వసతుల కల్పన
మన ఊరు-మన బడి పథకం ద్వారా మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అత్యధికంగా విద్యార్థులుండే 9,123 (35 శాతం) స్కూళ్లను అధికారులు తొలి దశలో ఎంపిక చేశారు. వాటికోసం రూ.3,497.62 కోట్లు ఖర్చు చేస్తారు. పథకం నిర్వాహణను (టెండర్లు ఇతర నిధుల ఖర్చు) మొత్తం ఆన్లైన్ ద్వారానే చేపడతారు. ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసే ఉపకరణాలను రాష్ట్రస్థాయిలో ఎంపిక చేస్తారు. పనుల బాధ్యతను మొత్తం జిల్లాల కలెక్టర్లకే ప్రభుత్వం అప్పగించింది. టెండర్ల ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేసే బాధ్యతనూ వారికే ఇచ్చింది. సాంకేతిక పరమైన అనుమతులు సంబంధిత ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. పనులన్నీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)ల భాగస్వామ్యంతో చేపడతారు. ఎస్ఎంసీ చైర్మెన్, హెడ్మాస్టర్, అసిస్టెంట్ ఇంజినీర్, సర్పంచ్‌లకు ఉమ్మడి చెక్‌పవర్‌ను అప్పగించింది. పథకానికి అవసరమైన నిధులను సమగ్ర శిక్షా అభియాన్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఏసీడీపీ, జెడ్పీపీ, ఎంపీపీతోపాటు ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్, నాబార్డ్, జిల్లా గ్రంథాలయాల సంస్థలు వంటి వాటి ద్వారా సమకూరుస్తారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రూ.30 లక్షల వరకు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు, సూపరింటెండెంట్ ఇంజినీర్ రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు, చీఫ్ ఇంజినీర్ రూ.2 కోట్ల కంటే ఎక్కువ నిధులను మంజూరు చేసే అధికారం ఉంటుంది. అయితే ఆ నిధులను కలెక్టర్ల అనుమతితోనే ఇవ్వాలి. దాతలు రూ.రెండు లక్షలిస్తే వారిపేరును ఎస్ఎంసీ జాబితాలో చేరుస్తారు. దాతలు రూ.10 లక్షలిస్తే వారి పేరును ఒక తరగతి గదికి పెడతారు. పాఠశాలలకు డ్యూయల్ డెస్క్‌లు, స్మార్ట్ క్లాస్‌కు అవసరమైన సామాగ్రి, పెయింట్, గ్రీన్ చాక్బోర్డు, ప్రిన్సిపాల్, సిబ్బంది ఫర్నీచర్, గ్రంథాలయం ఫర్నీచర్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌కు అవసరమైన సామాగ్రిని రాష్ట్రస్థాయిలోనే ఎంపిక చేసిన పంపిస్తారు.